నవతెలంగాణ- హైదరాబాద్: రూఅఫ్జాపై రామ్‌దేవ్ కొత్త వీడియో విడుదల చేయడంపై ఢిల్లీ హైకోర్టు గురువారం తీవ్రంగా స్పందించింది. అవమానకరమైన వ్యాఖ్యలతో రూఅఫ్జాపై రామ్‌దేవ్ మరో కొత్త వీడియోను రూపొందించడం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. రామ్‌దేవ్ ప్రవర్తన ఆయన ఎవరి నియంత్రణలోనూ లేరని, తన సొంత ప్రపంచంలో నివసిస్తున్నారని ధృవీకరిస్తుందని జస్టిస్ అమిత్ బన్సాల్ పేర్కొన్నారు. ఆయన ఆలోచనలను తనలోనే ఉంచాలని, వాటిని వ్యక్తపరచవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.
హమ్‌దార్డ్ సంస్థకి చెందిన రూఅఫ్జాపై రామ్‌దేవ్ ఇకపై ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు, ప్రకటనలు లేదా వీడియోలను పోస్ట్ చేయకూడదంటూ గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వుల దృష్ట్యా ఆయన అఫిడవిట్, వీడియో ప్రాథమికంగా కోర్టు ధిక్కారణ కిందకే వస్తాయని బన్సాల్ మండిపడ్డారు. విచారణకు హాజరుకావాల్సిందిగా రామ్‌దేవ్‌కు నోటీసులు జారీ చేశారు.
కేసు వివరాలు :
ఈ నెల ప్రారంభంలో పతంజలికి చెందిన గులాబ్ షర్బత్‌ను ప్రచారం చేస్తూ.. రూఅఫ్జా నుండి వచ్చే ఆదాయాన్ని మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు వినియోగిస్తున్నారని రామ్‌దేవ్ ఆరోపించారు. షర్బత్ జీహాద్ అంటూ రూఅఫ్జాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలపై విచారణ చేపట్టాల్సిందిగా హమ్‌దార్డ్ కోర్టును ఆశ్రయించింది. రామ్‌దేవ్ వ్యాఖ్యలు సమర్థించలేనివని, దిగ్భ్రాంతికి గురిచేశాయని ఏప్రిల్ 22న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కోర్టు వ్యాఖ్యానించింది. ప్రకటనలు, సోషల్‌మీడియా పోస్టులతో సహా ఆన్‌లైన్ కంటెంట్‌ను వెంటనే తొలగిస్తామని రామ్‌దేవ్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈహామీని ధృవీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది.