Tuesday, April 29, 2025
Navatelangana
Homeనేటి వ్యాసంరాహుల్‌వి పిల్లచేష్టలైతే,మోడీ పెద్దరికమేది?

రాహుల్‌వి పిల్లచేష్టలైతే,మోడీ పెద్దరికమేది?

- Advertisement -

రామాయణంలో రాముడికి పేరు ఎలా వచ్చిందంటే ప్రధాన కారకుడు రావణ పాత్రధారి అని కొందరు అంగీకరించకపోవచ్చు. సీత గీత దాటకపోతే రామకథే లేదు అన్నవారు కూడా ఉన్నారు. అలాగే రాహుల్‌ గాంధీకి ప్రాచుర్యం కల్పించటంలో బీజేపీ నేతలు, వారి కనుసన్నల్లో నడిచే మీడియా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి అంతకు ముందు లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పెద్ద సంఖ్యలో ఓట్లు పెరగటం, సాయంత్రం 5.30 నుంచి 7.30 మధ్యలో 65లక్షల ఓట్లు పోల్‌ కావటం గురించి గతంలో చేసిన విమర్శలు లేదా ఆరోపణలనే రాహుల్‌ గాంధీ మరోసారి చేశారు. అది అమెరికాలోని బోస్టన్‌ నగరంలో పునశ్చరణ చేయటాన్ని బిజెపి తప్పు పడుతూ దేశద్రోహం అన్నట్లుగా దాడికి దిగింది. మన గడ్డమీద ఎన్నయినా అనుకోవచ్చుగానీ విదేశాల్లో మన రాజ్యాంగ సంస్థలను విమర్శించటం ఏమిటి అంటూ మనోభావాలను ముందుకు తెచ్చింది. దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, వాటి మీద దాడి చేయటంలో బిజెపి తీరు అనితర సాధ్యం. ఎన్నికల కమిషనర్లు, ప్రధాన కమిషనర్‌ నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్న పద్దతిని మార్చి సిజె స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టారు. అంటే ముగ్గురిలో రెండు ఓట్లు అధికారంలో ఉన్నవారికి ఉంటాయి గనుక ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు, అలాంటి వారు ఎలా పని చేస్తారో వేరే చెప్పనవసరం లేదు. రాహుల్‌ గాంధీ చెప్పినట్లు అలా నియామకం పొందిన వారు రాజీ పడక ఏం చేస్తారు, నియమించిన వారికి వ్యతిరేకంగా వ్యవహరించగలరా? వారేమైనా టిఎన్‌ శేషన్‌ వంటివారా?
ఈ పూర్వరంగంలోనే ఎన్నికల కమిషన్‌ రాజీపడుతున్నదని, వ్యవస్థలోనే లోపం ఉన్నదని రాహుల్‌ గాంధీ బోస్టన్‌లో చేసిన వ్యాఖ్యలను బీజేపీ వివాదం కావించింది.ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్‌ గురించి ఎన్నికల కమిషన్‌ గతంలోనే తన చర్యను సమర్ధించుకున్నది. మొత్తం 9.7కోట్ల మంది ఓటర్ల గురించి కేవలం 90 అప్పీళ్లు మాత్రమే వచ్చినందున జాబితా సరైనదే అని ఎన్నికల కమిషన్‌ సమర్ధించుకుంది, 30లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైతే ఆ స్థాయిలో ఫిర్యాదులు రాలేదెందుకని ఎదురు ప్రశ్నించింది.రెండు గంటల సమయంలో 65లక్షల ఓట్లు వేయటం ఎలా సాధ్యమని రాహుల్‌ గాంధీ ప్రశ్న, వీడియో చిత్రాలను కూడా అడిగేందుకు వీల్లేకుండా చట్టాలను సవరించారని పేర్కొన్నారు. వీటికి సమాధానం లేదు. రిగ్గింపు ఎప్పుడు ఎలా చేస్తారో మనకు తెలియదా ! రాహుల్‌ గాంధీవి పిల్లచేష్టలని,విదేశీ గడ్డ మీద ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నట్లు బీజేపీ ధ్వజమెత్తింది. విదేశీ పర్యటనల్లో విమర్శలు చేయటం కొత్త కాదు, గతంలో కూడా చేశారు. ఆ మాటకు వస్తే వయసులో పెద్దమనిషి, ఒక ప్రధానిగా నరేంద్రమోడీ చేసిందేమిటి ? పెద్దలు నడిచిన బాటనే పిల్లలూ అనుసరిస్తారు. ఒక రాజకీయ నేత తన ప్రత్యర్ధి పార్టీ లేదా ప్రభుత్వం, వ్యవస్థల గురించి స్వదేశంలో విమర్శించి విదేశాల్లో పొగడాలా, ఆ పని చేస్తే సమావేశాలకు వచ్చిన వారు గడ్డి పెట్టరా లేదా నేను మాట్లాడను అని నోరుమూసుకోవాలా ? నరేంద్రమోడీ అదే చేశారా ? కాంగ్రెస్‌ను స్వదేశంలో విమర్శించినట్లే విదేశాల్లోనూ ధ్వజమెత్తారు. ఆ పార్టీనే కాదు, అవినీతిదేశం అంటూ జాతి పరువునే తీశారు.
2015లో జర్మనీ వెళ్లినపుడు కాంగ్రెస్‌ పార్టీ వదలివెళ్లిన చెత్తనంతా శుద్ధి చేయాల్సి ఉందని మోడీ చెప్పారు, భారత్‌ అంటే కుంభకోణాల దృశ్యమని, దాన్ని తాను నైపుణ్య దేశంగా మార్చనున్నట్లు కెనడాలో చెప్పారు. ఓమన్‌లో కూడా అదే చెప్పారు. కాంగ్రెస్‌ పాలనా కాలమంతా కుంభకోణాల మయమని, తప్పుడు పాలనా పద్దతులను సరిదిద్దేందుకు తాను ఎంతో కష్టపడుతున్నట్లు చెప్పుకున్నారు. గత జన్మల్లో ఏ పాపం చేశామో భారత్‌లో పుడుతున్నామని జనాలు చెప్పుకుంటున్నారని దక్షిణ కొరియా సియోల్‌లో మోడీ సెలవిచ్చారు.ఇలాంటి పరిస్థితిలో వదిలేసి వేరే చోటకు పోదామని అనుకున్నారు అలాగే వెళ్లారు.ఇప్పుడు నేను గట్టి విశ్వాసంతో చెప్పగలను, అన్ని జీవన రంగాలకు చెందిన ఆ తెలివైన వారు, ప్రముఖ శాస్త్రవేత్తలు కూడా వారు విదేశాల్లో పెద్ద మొత్తాలను సంపాదిస్తున్నప్పటికీ వారంతా తిరిగి రావటానికి, తక్కువ ఆదాయాలకు కూడా సిద్దపడి భారత్‌లో స్థిరపడటానికి రావాలని చూస్తున్నారని మోడీ చెప్పారు. చైనాలోని షాంఘై నగరంలో భారత సంతతి సమావేశంలో మాట్లాడుతూ గతంలో మీరు భారత్‌ గురించి సిగ్గుపడేవారు, ఇప్పుడు (తాను ప్రధాని అయిన తరువాత) దేశం గురించి గర్వపడుతున్నారన్నారు. ప్రతిపక్షం మీద ధ్వజం, స్వంతడబ్బా ప్రతి చోటా కనిపిస్తుంది. 2014లో ఎన్నిక తరువాత న్యూయార్క్‌ పర్యటనలో మీరు ఓట్లు వేసి ఉండకపోవచ్చుగానీ ఫలితాలు వచ్చినపుడు మీరంతా పండగ చేసుకున్నారని ప్రవాస భారతీయులతో చెప్పారు. ప్రధానిగా 70దేశాలు తిరిగారని 50చోట్ల తన ప్రత్యర్ధుల మీద రాజకీయ దాడి చేశారని పరిశీలకులు చెబుతున్నారు. అప్పుడు అది విదేశీ గడ్డా స్వదేశీ అడ్డా అన్నది గుర్తుకు రాలేదా? కంటికి కన్ను, పంటికి పన్ను, కుక్కకాటుకు చెప్పుదెబ్బ మాదిరి రాహుల్‌ గాంధీ కూడా అదే బాటలో నడుస్తూ విమర్శలు చేస్తున్నారు. తేడా ఏమిటంటే మోడీ మాట్లాడిన వాటిని గోడీ మీడియా పెద్దగా ప్రచారంలో పెట్టలేదు, చర్చల రచ్చ చేయలేదు, అంతే ! మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మా నెట్‌వర్క్‌ వస్తుందనే హచ్‌ కుక్క ప్రకటన మాదిరి నరేంద్రమోడీ ఏ విదేశ పర్యటన చేస్తే తాము కూడా ఒక సీనియర్‌ నేతను అక్కడకు పంపుతామని, అక్కడేమైనా తప్పుడు ప్రచారం, ఆరోపణలు చేస్తే అదే స్థాయిలో సమాధానం చెబుతామని, దేశాన్ని కించపరుస్తూ,ప్రతిపక్షం మీద ఆరోపణలతో మాట్లాడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోడీ అని 2015లోనే కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ విమర్శించారు. మోడీ ప్రధానిగా దేశాలు తిరుగుతున్నారు తప్ప ఆరెస్సెస్‌ ప్రచారక్‌ లేదా బీజేపీ ప్రతినిధిగా కాదన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను కించపరుస్తు న్నారంటూ రాహుల్‌ గాంధీ మీద ధ్వజమెత్తు తున్న బీజేపీ నేతలు ఏం చేస్తున్నారో దేశంతో పాటు ప్రపంచమంతా చూస్తోంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులనే వారు సవాలు చేస్తున్నారు. పార్లమెంటు సుప్రీం అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్‌ థంకర్‌ మరోసారి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ దగ్గరకు వచ్చిన బిల్లుల మీద మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని లేకుంటే వాటిని ఆమోదించినట్లు పరిగణించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి విమర్శించారు. అది ప్రజాస్వామిక శక్తులపై అణుక్షిపణి వంటిదని వర్ణించారు. సుప్రీం కోర్టుకు అలాంటి అధికారం లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం చట్టసభలు ఆమోదించిన బిల్లులను తిప్పి పంపే అధికారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఉంది. అయితే వాటిని తిరిగి చట్టసభలు మరోసారి ఆమోదించి పంపితే చట్టాలుగా ఆమోద ముద్రవేయటం తప్ప తిరస్కరించే అధికారం లేదు. అయితే రాష్ట్రపతి, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు నెలల తరబడి తిప్పి పంపకుండా ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్న పూర్వరంగంలో తమిళనాడు కేసులో సుప్రీ కోర్టు ఆ తీర్పు ఇచ్చింది. న్యాయవ్యవస్థ సూపర్‌ పార్లమెంటుగా వ్యవహరిం చజాలదని జగదీప్‌ తప్పుపట్టారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత రాష్ట్రపతి, గవర్నర్లదైతే, రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతున్నదా లేదా అన్న భాష్యం చెప్పేందుకు సుప్రీం కోర్టుకు అధికారం ఉంది.చట్టసభలు చేసిన నిర్ణయాలను కాదనే హక్కు లేదు గానీ, అవి నిబంధనల మేరకు జరుగుతున్నాయా లేదా అన్నది నిర్ణయించవచ్చు. ఇప్పుడు వక్ఫ్‌ సవరణ చట్టం గురించి సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దాని పరిధికి మించినా లేక ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా షాబానో తీర్పు మాదిరి పార్లమెంటులో బిల్లు పెట్టి దాన్ని రద్దు చేసే దమ్ము బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఉందా అన్నది సమస్య. ఉపరాష్ట్రపతి చెప్పినట్లుగా దేశానికి పార్లమెంటు, రాష్ట్రాలకు అసెంబ్లీలు ఉన్నతం, అవి ఆమోదించిన బిల్లులను నెలల తరబడి గవర్నర్లు తొక్కిపట్టటాన్ని ఏమనాలి, తానే స్వయంగా అలాంటి పనికి పాల్పడింది గుర్తులేదా, అప్పుడు అసెంబ్లీ సుప్రీం అన్న జ్ఞానం లేదా ?
ఉపరాష్ట్రపతి సుప్రీం కోర్టు మీద ధ్వజమెత్తటంతో కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవారు సున్నితంగా బీజేపీ నేతలకు చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్‌ ముర్షిదాబాద్‌లో హింస కారణంగా అక్కడకు పారామిలిటరీని పంపాలంటూ రాష్ట్రపతికి ప్రవర్తకాది లేఖ జారీ చేయాలన్న పిటీషన్‌పై స్పందించారు. ఇప్పటికే మేము కార్యనిర్వహణ పరిధిని ఆక్రమిస్తున్నామన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నాం అందువలన ఈ వినతిని తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. కోర్టు పేరుతో పశ్చిమబెంగాల్‌లో కేంద్ర బలగాలను దించాలన్న ఎత్తుగడ పిటీషనర్‌ వినతిలో ఉంది. మమతా బెనర్జీని సమర్ధిం చనవసరం లేదుగానీ విష్టు శంకర్‌ జైన్‌ అనే న్యాయవాది ఈ పిటీషన్‌కు ముందు రాష్ట్రపతి పాలన విధించాలని 2021లో కూడా కేసు వేశారు. పార్లమెంటూ కాదు, కార్యనిర్వాహక వ్యవస్థా కాదు రాజ్యాంగమే ఉన్నతమైనదని జగదీప్‌ థంకర్‌ వ్యాఖ్యల మీద రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ స్పందించారు. సిబల్‌ ప్రస్తుతం సుప్రీం కోర్టు బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. నోటి తుత్తర బీజేపీ నేతల్లో నిషికాంత్‌ దూబే ఒకరు. వక్ప్‌ చట్ట సవరణ చెల్లుతుందా లేదా అన్నదాని గురించి విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు దేశంలో మత యుద్ధాలను రెచ్చగొడుతున్నదని, తన హద్దులను దాటుతున్నదని నోరుపారవేసుకున్నాడు. తర్వాత ఎన్నికల కమిషన్‌ మాజీ ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ ముస్లిం కమిషనర్‌ తప్ప ఎన్నికల కమిషనర్‌ కాదని వదరుబోతుతనంతో మాట్లాడారు.దూబే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ ప్రకటించటం ఒక నాటకం తప్ప మరొకటి కాదు. అలా ప్రకటిం చిన తరువాతే ఖురేషీ గురించి మాట్లాడాడు. ఎందుకంటే వక్ఫ్‌ చట్టాన్ని ఖురేషీ విమర్శించారు.తానుగా అధికారికంగా చేయలేని వ్యాఖ్యలను దూబే వంటి వారితో బీజేపీ చేయించటం దానికి వెన్నతో పెట్టిన విద్య. దూబే అంతటితో ఊరుకోలేదు, దేశం హిందువులదని, గిరిజనులు, జైనులు, బౌద్దులు వారితో కలసి ఉన్నారని కూడా సెలవిచ్చారు. రెచ్చగొట్టే మాటలు మాట్లానికి దూబె పెట్టింది పేరు, అగ్రనేతల మనసులో ఉన్నదాన్ని వెల్లడించిన దూబే మీద ఎలాంటి చర్య ఉండదని, తప్పనిసరైతే ఏదో మమఅనిపిస్తారని ఒక ఎంపీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సుప్రీంకోర్టు గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కోర్టు ధిక్కరణ నేరం కింద దూబేపై చర్యలు తీసుకోవాలని వక్ప్‌ చట్ట సవరణను వ్యతిరేకిస్తున్న వారి తరఫు లాయర్‌ అనాస్‌ తన్వీర్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణికి లేఖ రాశారు, బీజేపీ చర్యతీసుకుంటుందా ?

-సత్య

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు