Wednesday, April 30, 2025
Homeతాజా వార్తలురేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

– లగచర్ల ఆడబిడ్డలను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
లగచర్ల ఆడబిడ్డలపై పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో సీఎం రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేయాలని అన్నారు. మూడేండ్లలో మళ్లీ బీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని, అప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రయివేటు సైన్యంలా ఓవరాక్షన్‌ చేస్తున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌ నందీనగర్‌లో కేటీఆర్‌ను కలిసిన లగచర్ల బాధితులు బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కోసం రూ.లక్షను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ లగచర్ల ఆడబిడ్డలపై లైంగిక వేధింపులు జరిగాయనీ, అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదికతో సిగ్గు తెచ్చుకుని సీఎం రేవంత్‌ రెడ్డి ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. రేవంత్‌ రెడ్డికి సిగ్గు, శరం ఉంటే దళిత, గిరిజనులపై జరిగిన అరాచకాలు, లైంగిక వేధింపులకు బాధ్యత వహించి రాజీనామా చేసి క్షమాపణ కోరేవారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ”బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ కోసం లగచర్ల గిరిజనులు రూ.లక్ష విరాళంగా ఇస్తే గుండెనిండా సంతోషంగా అనిపించింది. తాము కష్టంలో ఉన్నప్పుడు అండగా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉడతాభక్తిగా సహాయం చేస్తామని లగచర్ల గిరిజనులు చెప్పారు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా శారీరకంగా చిత్రవధ చేసే అవకాశం ఉంటుందో అన్ని రకాలుగా లగచర్ల గిరిజనులను పోలీసులు హింసించారు. హీర్యానాయక్‌కు ఛాతిలో గుండెనొప్పి వస్తే బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకుపోయిన నికృష్ట ప్రభుత్వం రేవంత్‌ రెడ్డిది. అతి కిరాతకంగా మానవ మగాల మాదిరిగా రేవంత్‌ రెడ్డి ప్రయివేటు సైన్యంలా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు లగచర్ల ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించారు.
తమకూ అక్కాచెల్లెళ్లు, ఆడపిల్లలు ఉంటారన్న ఇంగితం కూడా లేకుండా ఏ దిక్కులేనోళ్లు కదా అన్నట్టు వారి మీద కామాంధుల మాదిరిగా పోలీసులు దుర్మార్గంగా దాడి చేశారు. వీటిని ప్రశ్నించిన మా నాయకుడు నరేందర్‌ రెడ్డిని 37 రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు. ప్రభుత్వ దమనకాండకు బలైన లగచర్ల రైతులు తెలంగాణ భవన్‌కు వస్తే న్యాయం దక్కేలా చూస్తామని వారికి మా పార్టీ తరపున మాటిచ్చాం.” అని అన్నారు. ”లగచర్ల బాధితులను ఢిల్లీ దాకా తీసుకుపోయి మానవ హక్కుల కమిషన్‌, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, జాతీయ మహిళా కమిషన్‌ను మా పార్టీ నేతలు కలిశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనిని బీఆర్‌ఎస్‌ దేశం దృష్టికి తీసుకుపోయింది. దేశంలో ఇంకా న్యాయం, ధర్మం బతికే ఉన్నాయి. మానవత్వం కూడా మిగిలే ఉన్నదని ఎన్‌హెచ్‌ఆర్‌సీ రిపోర్ట్‌తో స్పష్టమైంది. హెచ్‌సీయూ భూముల విషయంలోనూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడా ఆర్థిక మోసానికి పాల్పడిందని మొన్ననే సుప్రీంకోర్టు నియమించిన సెంట్రల్‌ ఎంపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ కూడా అధికారమదంతో విర్రవీగుతున్న రేవంత్‌ రెడిక్డి చెంపపై కొట్టినట్టుగా రిపోర్ట్‌ ఇచ్చింది. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్‌సీ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రేవంత్‌ రెడ్డి అల్లుడిదని చెప్పుకుంటున్న ఫార్మాస్యూటికల్‌ కంపెనీ కోసం పేదల భూములు గుంజుకునే ప్రయత్నాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ అభిశంసించింది.” అని అన్నారు.
”ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, కొడంగల్‌ ఎమ్మెల్యేగా కూడా రేవంత్‌ రెడ్డి ఉన్నారు. అలాగే హౌంమంత్రి కూడా రేవంత్‌ రెడ్డినే. స్థానిక ఎమ్మెల్యేగా రేవంత్‌ రెడ్డి సిగ్గుపడాలి. ఇజ్జతుంటే రాష్ట్ర హౌంమంత్రిగా పోలీసులు దౌర్జన్యానికి ముక్కు నేలకు రాయాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. తననే కాదు తన అత్తను కూడా లైంగికంగా వేధించారని ఒక అమ్మాయి ఎన్‌హెచ్‌ఆర్‌సీకి చెప్పుకుంది. మన దేశంలోని ఆడపిల్లలు ఎవరూ ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పరు. పరిగి పోలీస్‌ స్టేషన్లో రైతుల్ని విపరీతంగా కొట్టి మెజిస్ట్రేట్‌ కు చెబితే మీ ఇంట్లో వాళ్ళను కూడా తీసుకొచ్చి కొడతామని పోలీసులు బెదిరించారు. ఆరోజు అక్కడ లేని వ్యక్తులను, ఆ సంఘటనలతో సంబంధం లేని రైతులను కూడా తీసుకొచ్చి పోలీసులు కొట్టారని ఎన్‌హెచ్‌ఆర్‌సీ రిపోర్ట్‌ ఇచ్చింది. థర్డ్‌ డిగ్రీ టార్చర్‌ పెట్టి శారీరకంగా చిత్ర హింసలు పెట్టి జడ్జి ముంగిట చెప్తే ఇంకా కొడతామని చెప్పి పోలీసులు బెదిరించినట్టు ఆ రిపోర్ట్‌లో పేర్కొంది. బాధ్యులైన పోలీసులపై ఆరు వారాల్లోపు చర్యలు తీసుకోవాలని కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ” అని కేటీఆర్‌ తెలిపారు. లగచర్లలో క్రూరంగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ రిపోర్ట్‌ ప్రకారం బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోకుంటే, లగచర్ల గిరిజనులకు న్యాయం చేయకపోతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img