- ఉద్యోగ భద్రత కల్పించాలి
నవతెలంగాణ-కామారెడ్డి: ఉద్యోగ భద్రత కోరుతూ..భిక్నూర్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణ పార్ట్ టైమ్ లెక్చరర్లు మంగళవారం వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. 9వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా పార్ట్‌టైమ్ లెక్చరర్లు అందరూ కలిసి వంట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలసత్వం వహించడం వల్లే తాము రోడ్డుపై వంట చేసుకొని తినే పరిస్థితికి కారణమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ ఆకలి ఆర్తనాధాలను విని వెంటనే తమకు తగిన న్యాయం చేయాలని అన్నారు. జిఓ నెం.21ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి జారీ చేసిన జీవో నెం. 21 లో తమకు వెయిటేజీ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. తక్కువ వేతనాలతో, ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా తాము గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇకనైనా తమ సర్వీసులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం క్యాంపస్ లోని టీచింగ్, నాన్ టీచింగ్ వారు కలిసి భోజనాలు చేసి పార్ట్ టైం లెక్చరర్లకు సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.