వక్ఫ్ సవరణ చట్టం-2025 భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడిన ఒక ముఖ్యమైన చట్టం. ఇది వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, దానాలు, వక్ఫ్ సంస్థల రక్షణకు సంబంధించిన నిబంధనలను సవరించే లక్ష్యంతో రూపొందించబడింది. సవరణ చట్టాన్ని తీసుకురావ డానికి ముందు బీజేపీ ఐటి సెల్, దాని వాట్సాప్ యూనివర్సిటీ, సంఘ్ పరివారమంతా వక్ఫ్ చట్టం గురించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. వక్ఫ్ చట్టం వక్ఫ్ బోర్డులకు విశేషమైన అధికారాలు ఇచ్చిందని, దాన్ని ఉపయోగించి ఎవరి ఆస్తులైనా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటిస్తారని, కొంతకాలమైతే పార్లమెంటును కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తారని కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజ్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏ మత సంస్థకు లేని ఆస్తులు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేయకపోవడం వలన ముస్లిం యువకులు పంచర్లు వేసుకొని బతకాల్సి వస్తోందని ప్రధానమంత్రి సైతం ప్రకటించారు. ఒక బోర్డుకు ఉన్న ఆస్తులు అక్రమంగా వచ్చాయని అర్థం వచ్చేలాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది, ఇలా అనేక రకాలుగా వక్ఫ్ చట్టానికి, ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం సాగింది. ఈ వాదనలోని వాస్తవాలు, అవాస్తవాలు ఏంటో పరిశీలించాలి. అలాగే, ఈ చట్టంలోని కొన్ని సవరణలు రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీ హక్కులను హరిస్తాయని, మత వివక్షను ప్రోత్సహిస్తాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు వాస్తవాలేటో, అవాస్తవాలేమిటో చూడాలి.
వక్ఫ్‌పై విద్వేష ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 77వేల ఎకరాల వక్ఫ్ భూములుండగా అందులో 55వేలఎకరాలు కబ్జాలకు గుర య్యాయి. నిజంగానే వక్ఫ్ బోర్డుకి విశేషమైన అధికారులు ఉంటే ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు ఎలా జరిగాయి? కబ్జాలకి గురైన భూములను ఎందుకు విడిపించుకోలేకపోయింది.విడిపించే న్యాయపరమైన, పరిపాలన పరమైన అధికారులు గాని, యంత్రాంగం గాని వక్ఫ్ బోర్డుకు లేవనేది అర్థమవుతున్నది. దేశవ్యాప్తంగా కూడా లక్షల ఎకరాల భూములు కబ్జాలోనే ఉన్నాయి. వక్ఫ్ సంస్థలకు మాత్రమే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని మరో ప్రచారం. దేశంలో మూడవ అతిపెద్ద ల్యాండ్‌హోల్డర్ వక్ఫ్ బోర్డు అని, ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని? ఇవన్నీ కబ్జాల ద్వారా వచ్చాయని? ముస్లిమేతరులలో ఒక అసూయ, ద్వేశం కలిగేలాగా విద్వేష ప్రచారం జరుగుతున్నది. ముస్లింలకు మాత్రమే సెంట్రలైజ్డ్ ఆస్తులు రికార్డ్ చేసే వ్యవస్థ ఉంది. మిగతా ఏ మతాలకు లేనందువల్ల ఆయా మత సంస్థల ఆధీనంలో ఉన్న ఆస్తుల వివరాలు తెలియడం లేదు. వక్ఫ్ ఆస్తుల్లో డెబ్బయిశాతం వరకు శ్మశానవాటికలు, మసీదులుంటాయి. ఆ లెక్కన చూస్తే హిందూ మతానికి సంబంధించిన శ్మశాన వాటికలు చిన్న పెద్ద గుళ్లు వివిధ స్వామీజీల మఠాలు అన్ని లెక్కిస్తే కోట్లాది ఎకరాల భూమి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో 4,53,000 గ్రామాలు, 7933 పట్టణాలు ఉన్నాయి. శ్మశానవాటికలు, గుళ్లు లేని గ్రామాలు, పట్టణాలుండవు. తమిళనాడు రాష్ట్రంలో 2,70,000 ఎకరాలు, తెలంగాణలో 80వేల కరాలు దేవాదాయ భూములునట్లుగా ఆయా రాష్ట్రాల దేవాదాయ ధర్మాదాయ శాఖ బోర్డు లెక్కలు చెబుతున్నాయి. ఏ మత సంస్థలకైనా ఆయా మతాల అనుచరులు, భక్తులు స్వచ్ఛందంగా దానం చేయడం ద్వారా ఆస్తులు ఉంటాయి.
రాజ్యాంగ విరుద్ధమెలా?
ఈ చట్టం రాజ్యాంగంలోని ఏడు ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తున్నాయి. ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 15 (మత వివక్షత నిషేధం), ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ హక్కు), ఆర్టికల్ 26 (మత సంస్థల నిర్వహణ హక్కు), ఆర్టికల్ 29 (సాంస్కృతిక హక్కు), ఆర్టికల్ 30(1) (మైనారిటీ విద్యా సంస్థల హక్కు), ఆర్టికల్ 30(1ఎ) (మైనారిటీ సంస్థల ఆస్తుల నిర్వహణ హక్కు). ఇంకా వక్ఫ్ చేయాలంటే ఐదేండ్లు ప్రాక్టీసింగ్ ముస్లింగా ఉండాలనే షరతు. కొత్త చట్టం ప్రకారం, వక్ఫ్ ఆస్తి దానం చేయాలంటే దాత ఐదేండ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్నట్లు నిరూ పించుకోవాలి. ఈ నిబంధన ముస్లిమేతరులు దర్గాలు, మసీదులు, లేదా ఇతర మత, సేవా కార్యక్రమాలకు దానం చేయకుండా నిషేధిస్తుంది. ఒకవేళ వాళ్లు దానం చేయాలంటే ముందు ఇస్లాం మతంలోకి మారి, ఈ షరతును నెరవేర్చాలి. ఇతర మతస్తులు ముస్లిం మతధార్మిక సేవా కార్యక్రమాలకి ఏదైనా దానం చేయాలంటే మతం మార్చుకోవాల్సిన దుస్థితిని చట్టం కల్పిస్తుంది. ఇతర మత సంస్థలకు అంటే హిందూ దేవాల యాలు, సిక్కు గురుద్వారాలు మొదలగు వాటికి దానం చేయడానికి ఇలాంటి షరతులు లేవు. ఈ నిబంధన అందరూ సమానులే అనే ఆర్టికల్ 14కు వ్యతిరేకం. ఈ సవరణ పౌరుల మతం ఆధారంగా వివక్ష పాటిస్తున్నది. కాబట్టి మత వివక్షతను నిషేధించిన ఆర్టికల్ 15ను ఉల్లంఘిస్తుంది. వక్ఫ్‌బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులను సభ్యులుగా నియమించాలనే సవరణ ఏ మతానికి చెందిన సంస్థలను వారు నిర్వ హించుకోవాలని చెప్పే ఆర్టికల్ 26ను ఉల్లంఘిస్తుంది. ఇతర మతసంస్థల బోర్డుల్లో ఉదాహరణకు టీటీడీ కమిటీ, సిక్కుల గురుద్వారా ప్రబ ంధక్ కమిటీల్లో ఆయా మతాలకు చెందని వారికి స్థానం లేనప్పుడు, వక్ఫ్ బోర్డుల్లో ఈ నిబంధన పెట్టడం మత వివక్షను పాటిస్తున్నట్టవుతుంది.
యథేచ్ఛగా మైనార్టీ హక్కుల ఉల్లంఘన
ఆర్టికల్ 30(1) ప్రకారం, మైనార్టీ సముదాయాలకు తమ సంస్కృతి, భాష, మతాన్ని విద్యద్వారా పరిరక్షించే హక్కు ఉంది. ఉదాహ రణకు, మదరసాలు, క్రైస్తవ మిషనరీ స్కూళ్లు, సిక్కు గురుకులాలు, వేద పాఠశాలలు ఈ హక్కు కింద రక్షించబడతాయి. సమస్యమేమిటంటే? వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చడం వల్ల మదర్సాలు, వక్ఫ్ విద్యాసంస్థల నిర్వహణలో ముస్లిమేతరుల జోక్యం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది మైనార్టీల సంస్థల స్వతంత్ర నిర్వహణ హక్కును హరిస్తుంది. ఆర్టికల్ 30(1ఎ)ను ఉల్లంఘిస్తుంది. గతంలో, ”వక్ఫ్ బై యూజర్” నిబంధన ద్వారా, పత్రాలు లేకపోయినా చారిత్రక ఆధారాలతో మసీదులు, ఖబ్రస్తాన్, దర్గాలు, మసీదులు, మదరసాలు వంటి సంస్థలను వక్ఫ్ ఆస్తులుగా గుర్తించేవారు. అనేక రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థిస్తూ తీర్పులిచ్చాయి. సవరించిన ప్రకారం ఈ నిబంధనను తొలగించడం వల్ల, డాక్యుమెంట్లు లేని వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, ఢిల్లీలోని జామా మజీద్ కు డాక్యుమెంట్స్ లేవు ఎందుకంటే అది వందల సంవత్సరాల క్రితం నిర్మించినది. ఈ సవరణ వల్ల అది వక్ఫ్ ఆస్తి కాకుండా పోతుంది. ఒక పాత మదర్సా చారిత్రకంగా వక్ఫ్ ఆస్తిగా ఉన్నా, డాక్యుమెంట్లు లేకపోతే అది కోల్పోయే అవకాశం ఉంది. ఇది ఆర్టికల్ 30(1ఎ)ను ఉల్లంఘిస్తుంది, ఇది మైనార్టీ విద్యా సంస్థల ఆస్తుల రక్షణను నిర్ధారిస్తుంది.
సెక్షన్ 107, సెక్షన్ 40 తొలగింపు
ఒకసారి వక్ఫ్ చేసిన ఆస్తి ఎల్లప్పుడూ వక్ఫ్ ఆస్తిగా ఉంటుంది. దేవాదాయ ధర్మాదాయ భూములకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎందు కంటే దేవుడు పేరున ఉండే ఆస్తులకి వారసులు ఎవరు ఉండరు, కాబట్టి కొనుగోలు అమ్మకం జరిగే అవకాశం లేదు. అందుకే శాశ్వతంగా వక్ఫ్ ఆస్తులుగానే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1995 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 107 ద్వారా, వక్ఫ్ ఆస్తులపై లిమిటేషన్ యాక్ట్ (1963) వర్తించదు, దీనివల్ల పన్నేండేండ్ల తర్వాత కూడా ఆక్రమణలకు గురైన వక్ఫ్ ఆస్తులను తిరిగి పొందవచ్చు. సవరణ ప్రభావం చూస్తే కొత్తచట్టం సెక్షన్ 107ను తొలగిస్తుంది. దీనివల్ల పన్నెండేండ్లకు మించి ఆక్రమించబడిన వక్ఫ్ ఆస్తులు ఆక్రమణదారులకే చెందుతాయి. ఇది వక్ఫ్ ఆస్తుల శాశ్వత స్వభావానికి విరుద్ధం, దురాక్రమణలను ప్రోత్సహిస్తుంది.1954 ఒక్క చట్టంలో ఉన్న బలహీనతల వల్ల లక్షల ఎకరాల ఆస్తులు కబ్జాకు గురయ్యాయి. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం సెక్షన్ 40 ప్రవేశపెట్టారు. 1995 వక్ఫ్ చట్టంలోని ఈ సెక్షన్ ద్వారా, వక్ఫ్ ఆస్తులను దురాక్రమణ నుండి విడిపించడానికి చట్టబద్ధంగా అవకాశం ఏర్పడింది.ఈ సెక్షన్ ద్వారా ఆక్రమణకు గురైందని ఆస్తులను చారిత్రక ఆధారాలను ఉపయోగించి వక్ఫ్ భూములుగా క్లెయిమ్ చేసి వక్ఫ్ బోర్డులు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. సవరణ తర్వాత ఈ సెక్షన్‌ను రద్దు చేయడం వల్ల దురాక్రమణదారుల నుండి ఆస్తులను తిరిగి పొందే అవకాశం లేకుండా పోతుంది. చారిత్రక ఆధారాలను బేస్ చేసుకుని వక్ఫ్ ఆస్తులుగా క్లెయిమ్ చేయడానికి ఉండే అవకాశం రద్దు చేయబడుతుంది. ఇది వక్ఫ్ ఆస్తుల రక్షణను బలహీనపరుస్తుంది.
వక్ఫ్ సర్వే వ్యవస్థ రద్దు, అధికారాల కుదింపు
గత చట్టంలో వక్ఫ్ సర్వే కమిషనర్లు స్వతంత్రంగా ప్రభుత్వమే నియమిస్తుంది. వారు భూమిని సర్వే చేసి, అది వక్ఫ్ ఆస్తి అవునా? కాదా? అనేది నిర్ణయించేవారు. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేసి, ఈ అధికారాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. వక్ఫ్ బోర్డుకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్య సమస్య తలెత్తినప్పుడు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ ఒత్తిడికి లోనై, వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇది రాజకీయ జోక్యాన్ని పెంచుతుంది.అలాగే సవరణ చట్టం వక్ఫ్ ట్రిబ్యునల్, వక్ఫ్ బోర్డు అధికారాలను తగ్గించింది. ఇప్పటికే నామమాత్రపు వ్యవస్థలుగా ఉన్న వక్ఫ్ బోర్డులు కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారిపోతాయి. దీనివల్ల వక్ఫ్ ఆస్తుల రక్షణ, నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయి.
వీటన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అసలు విషయం ప్రజలకు అర్థమవుతుంది. వక్ఫ్ సవరణ చట్టం-2025 రాజ్యాంగ స్ఫూర్తిని, మైనారిటీ హక్కులను, మత స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా రూపొందించబడింది. ఈ చట్టం కొత్త వక్ఫ్ దానాలను ఆటంకపరుస్తుంది, మత వివక్షను పెంచుతుంది, వక్ఫ్ ఆస్తులను దురాక్రమణకు గురిచేసేలా అవకాశం కల్పిస్తుంది. ఈ చట్టం మైనారిటీల సాంస్కృతిక, విద్యా హక్కులను కాలరాస్తుంది. అందుకే, ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేదా సమూలంగా సవరించాలని డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగుతున్నది. ఇది కేవలం మైనార్టీలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న సవరణ. దేశంలో మత విభజనను పెంచి పోషించి తద్వారా రాజకీయంగా లబ్ధ పొందడం కోసం బీజేపీ ఆడుతున్న నాటకం. రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి. రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలందరూ ముక్తకంఠంతో వక్ఫ్ సవరణ చట్టాన్ని ఖండించాలి. ఉద్యమంలో పాల్గొనాలి. అప్పుడే బీజేపీ కుట్ర పూరితంగా చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలను నియంత్రించగలం, రాజ్యాంగాన్ని కాపాడుకోగలం.
– ఎండి.అబ్బాస్, 9490098032
వక్ఫ్ సవరణ చట్టం 2025 – ప్రచారాలు, వాస్తవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES