పరిమళించిన నిండు పచ్చదనాన్ని
ఓర్వలేని శిశిరమంటి కాలమెలా
ఎత్తుకెళ్లిపోయిందో
వనాన్నికన్న పచ్చటి మాతృహృదయం
ఈనాటికిలా వార్ధక్యంతో వాడిపోయిందా
సకల ప్రాణులకు
ప్రాణమంటి వసంతాన్ని
ప్రాణంగా పెంచిన వనజీవి
అమరజీవయ్యేనా
ఒక జీవితాన్ని నేలతల్లి
పాదాలకు పచ్చటి పారాణిగా పూసిన
అచ్చమైన త్యాగం
కనుమరుగైపోయిందా
ఆ అడుగుల్లోంచి ఊపిర్లు పోసుకొని
సగర్వంగా తలెత్తిన లెక్కలేనన్ని
మొక్కలిప్పుడు మౌనంగా రోదిస్తున్నాయి
ఆకులల్లార్చి పదుగురు పచ్చగా బతకాలన్న
ఆ వనరుషి స్వార్థం తప్పా?
ఏ ధనం ఆశించక బతుకుల్ని కాచే ఇంతటి
వన ఇంధనం సృజించిన నిస్వార్థం తప్ప!
భూమండలానికి ఆశయ కమండలంతో
పచ్చని పరిపుష్టిని వనహార వరమిచ్చిన
వనజీవి రామయ్యా..!
మాకోసం మళ్లీ రావయ్యా..!!
– భీమవరపు పురుషోత్తమ్