Tuesday, April 29, 2025
Homeతాజా వార్తలువనజీవి విషాద గీతం

వనజీవి విషాద గీతం

– నిద్రలోనే కన్నుమూసిన పద్మశ్రీ రామయ్య
– కోటికి పైగా మొక్కలు నాటిన యోధుడు
– ‘వృక్షో రక్ష్షతి రక్షిత:’ నినాద ప్రచారకర్త
– సంతాపం తెలుపుతూ తెలుగులో ప్రధాని ట్వీట్‌
– తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్రమంత్రులు, ప్రముఖుల నివాళి
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఆకులో ఆకై.. మొక్కల్లో మొక్కై.. చెట్లలో చెట్టై.. పచ్చని ప్రకృతై.. పర్యావరణ హితుడై.. ప్రాణవాయువుకు ఆయువై.. కోటికి పైగా మొక్కలు నాటి ప్రాణి కోటికి ప్రాణప్రదమైన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అలియాస్‌ దరిపల్లి రామయ్య(85) శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. గుండెపోటుతో శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపాలెం గ్రామంలోని ఇంట్లో రాత్రి నిద్రించిన ఆయన ఉదయం నిద్రలేవక పోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కొంతకాలంగా రామయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కోటికిపైగా మొక్కలు నాటి వనజీవి రామయ్య, జానకమ్మ దంపతులు చరిత్ర సృష్టించారు. మొక్కలను పెంచాలని చిన్నతనం నుంచే ప్రచారం చేశారు. మొక్కల కోసం ఆయన జీవితాన్నే త్యాగం చేశారు.
పశువుల కాపరి నుంచి పద్మశ్రీ దాకా..
రామయ్య ఖమ్మం రూరల్‌ మండలం ముత్తగూడెం గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేక పశువుల కాపరిగా పని చేశారు. 1967లో జానమ్మ (జానకమ్మ)ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇద్దరు కుమారులు సైదులు, సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. రామయ్య కుటుంబానికి గతంలో ఏడు ఎకరాల భూమి ఉండేది. మొక్కలు నాటేందుకు ఖర్చుల కోసం మూడెకరాల భూమి అమ్మాడు. పుస్తకాల్లో అశోక చక్రవర్తి గురించి చదివిన రామయ్య.. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని రహ దారులకిరువైపులా మొక్కలు నాటడం ప్రారంభించారు. ఇలా కోటికి పైగా మొక్కలు నాటారు. దరిపల్లి రామయ్య కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 మార్చి 30వ తేదీన పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా రామయ్య అవార్డు అందుకున్నారు.
అవార్డులు..
2013 ఏప్రిల్‌ 8వ తేదీన బెంగళూరుకు చెందిన అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ అనే సంస్థ రామయ్యకు డాక్టరేట్‌ ప్రదానం చేసింది. తరువాత నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డి, రోశయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, నాటి గవర్నర్‌ సుశీల్‌ కుమార్‌ షిండే చేతుల మీదుగా ప్రశంసలు, సన్మానాలు అందుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎంతో మంది అధికారులు సన్మానాలు చేశారు. అదేవిధంగా ఆయన అద్భుతమైన శిల్పి కూడా. గ్రానైట్‌ రాళ్లపై దేవుళ్ల చిత్రాలతో పాటుగా ‘వృక్షో రక్షితి రక్షిత్ణ’ అంటూ చెక్కేవారు.
సంతానానికి మొక్కల పేర్లు..
మొక్కలపై ఉన్న ప్రేమను రామయ్య దంపతులు తమకు ఎలా అవకాశం ఉంటే అలా ప్రదర్శించేవారు. తన కుమారులు, కూతురు పిల్లలకు మొక్కల పేర్లు పెట్టారు. నలుగురు మనువరాళ్లకు కదంబ పుష్పం, చందనపుష్పం, వనశ్రీ, హరితారణ్య అనే పేర్లు పెట్టారు.
‘వృక్షో రక్షతి రక్షిత: ‘ నినాదంతో..
వృక్షో రక్షతి రక్షిత:’ అనే నినాదాన్ని రామయ్య, జానకమ్మ దంపతులు తమ తలపాగాగా ధరించి విస్తృతంగా ప్రచారం చేశారు. 2000లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన టీవీఎస్‌ వాహనంపై తిరుగుతూ మొక్కలు నాటేవారు. పెట్రోల్‌కు నెలకు రూ.1500 ప్రభుత్వం తరపున ఇచ్చేవారు. తర్వాత ప్రభుత్వం మారి తనకు డబ్బులు ఇచ్చేవారు లేకపోయినా సైకిల్‌పై సాధ్యమైనంత వరకు ప్రచారం చేసేవారు. ప్రాణికోటికి ప్రాణవాయువు అందించిన వనజీవి రామయ్య అనంత వాయువుల్లో కలవటం కలచి వేస్తోందని పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్‌
వనజీవి రామయ్య లక్షలాది మొక్కలు నాటడానికి, వాటిని రక్షించడానికి తన జీవితాన్ని అంకితమిచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ట్వీట్‌ చేశారు.ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యు లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు.
పర్యావరణంతోనే మనుగడ : ఎనుముల రేవంత్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి
ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి.. వనజీవిగా పేరుగాంచిన పద్మశ్రీ రామయ్య. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేశారు. రామయ్య మృతి సమాజానికి తీరని లోటు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.
పర్యావరణ ఉద్యమానికి లోటు : నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి
పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి వార్త తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యాను. పర్యావరణ పరిరక్షణకు కోటి మొక్కలు నాటిన రామయ్య కృషి స్ఫూర్తిదాయకం. నేటి తరానికి రామయ్య ఆదర్శప్రాయుడు. ఆయన మరణం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఇంటి పేరును వనజీవిగా..: కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇంటి పేరును వనజీవిగా మార్చుకుని పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ రామయ్య స్వర్గస్తులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను.రామయ్య జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.
రామయ్య మృతి దేశానికి లోటు : మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
పద్మశ్రీ అవార్డు గ్రహిత దరిపల్లి రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటు. పర్యావరణ పరిరక్షణకు అంకితమై ఆరున్నర దశాబ్దాలుగా ఆయన హరిత యాత్రను కొనసాగించారు. వారి జీవితం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి.
ఇంటిపేరునే వనజీవిగా..: తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి
పర్యావరణ హితం కోసం కోటి మొక్కలు నాటి ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోయాం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ మంత్రి
రామయ్య వంటి గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోవడం చాలా బాధాకరం. వనజీవి రామయ్య తపనంతా మొక్కలు పెంచడం, సంరక్షించడమే.. మరణించే వరకు వన సంరక్షణే ధ్యేయంగా శ్రమించి భావితరాలకు స్ఫూర్తి నింపారు.
పర్యావరణ యోధుడు: నారా లోకేష్‌, ఏపీ మంత్రి
వృక్షో రక్షతి రక్షిత్ణ” అన్న రామయ్య జీవన సందేశమే ఆయన జీవిత సారాంశం. చెట్లను వంశపారం పర్యంగా భావించి, వాటిని సంరక్షించడం ద్వారా భవిషత్‌ను కాపాడతామని చెప్పిన ఆయన అసలైన పర్యావరణ యోధుడు. ఆయన శ్రమ, త్యాగం వల్ల ఎన్నో వేల ఎకరాల అడవులు పునరుద్ధరించబడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img