నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో తొలి కాపీని సోమవారం సచివాలయంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క తదితరులు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై దామోదర మాట్లాడుతూ వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదనీ, దళితుల్లో ఉన్న అంతర్గత వెనుకబాటుతనం, అసమానతలను తొలగించేందుకేనని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన ఎనిమిదిన్నర నెలల్లోనే వర్గీకరణను అమల్లోకి తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ”వారి త్యాగాలను ఎల్లకాలం గుర్తుంచుకుని, వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులోని అంశాలు, ఎంపిరికల్ డేటా, విద్య, ఉద్యోగ అవకాశాలు, సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని వర్గీకరణ చేపట్టామని తెలిపారు. ”59 షెడ్యూల్డ్ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లను కేటాయించాలని వన్ మ్యాన్ కమిషన్ సూచించింది. రిపోర్ట్ ఆధారంగా అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూపు 1లో చేర్చి, వారికి 1 శాతం రిజర్వేషన్ కేటాయించాం. రిజర్వేషన్ల ద్వారా మధ్యస్తంగా ప్రయోజనం పొందిన 18 కులాలను గ్రూపు 2లో చేర్చి, వీరికి 9 శాతం రిజర్వేషన్ కేటాయించాం. మెరుగైన ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ 3లో చేర్చి, వారికి 5 శాతం రిజర్వేషన్ కల్పించాం. మొత్తం 59 కులాల్లో 33 కులాలు పాత వర్గీకరణలో ఏ గ్రూపులో ఉన్నాయో, కొత్త వర్గీకరణలోనూ అదే గ్రూపులో కొనసాగుతు న్నాయి. 26 కులాలు మాత్రమే మార్పులకు గురయ్యాయి. మొత్తం ఎస్సీల జనాభాలో 26 కులాల జనాభా 3.43 శాతం మాత్రమే. 2026 జనాభా లెక్కల తర్వాత, ఎస్సీల జనాభాకనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని దామోదర రాజనర్సింహ వివరించారు. రిజర్వేషన్ల ప్రకారమే రాబోయే రోజుల్లో ఉద్యోగాల భర్తీ చేపడుతామని వెల్లడించారు. త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు రానున్నాయని తెలిపారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఉద్యోగాలను సాధించుకునేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తించబోదని స్పష్టం చేశారు.
ఉద్యోగాల భర్తీలో ప్రిఫరెన్షియల్ విధానం
ఎస్సీలకు ప్రభుత్వ ఉద్యోగాలను సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అమలు చేయనుంది. వర్గీకరణ అమలు మొదలైన నేపథ్యంలో సర్కార్ ఈ విధానాన్ని ఎంచుకుంది. ఇప్పటికే వికలాంగులకు ఉద్యోగాల్లో ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఎస్సీల్లోని గ్రూప్-1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్-2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేస్తారు. ఒకవేళ గ్రూప్-2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్-3లోని అభ్యర్థులతో భర్తీ చేస్తారు.గ్రూప్-1,2,3 మూడింటిలోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రిఫరెన్షియల్ విధానం వికలాంగుల కేటగిరీలోని అభ్యర్థుల కు అమలవుతోంది. ఈక్రమంలో ఎస్సీ వర్గీకరణను ప్రారంభించడం వల్ల ఈ విధానాన్ని ఎస్సీ అభ్యర్థులకూ అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగుల రిజర్వేషన్ల శాతాల ప్రకారం ఇవి ఉంటాయి. అయితే ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రోస్టర్ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించింది. ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్-1కు ఒకటి, గ్రూప్-2కు తొమ్మిది, గ్రూప్-3కు ఐదు రోస్టర్ పాయింట్లు రానున్నాయి.
వర్గీకరణ ఏ కులానికీ వ్యతిరేకం కాదు
- Advertisement -
RELATED ARTICLES