Thursday, May 1, 2025
Homeఅంతర్జాతీయంవాణిజ్య ఒప్పందాలపై జాగ్రత్త

వాణిజ్య ఒప్పందాలపై జాగ్రత్త

– యూఎస్‌తో రాజీ పడితే గౌరవం లభించదు : పలు దేశాలకు చైనా హెచ్చరిక
బీజింగ్‌: అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునే దేశాలకు చైనా పలు హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా తమ దేశానికి నష్టం చేసేలా డోనాల్డ్‌ ట్రంప్‌ విధిస్తున్న షరతులకు తలొగ్గి యూఎస్‌తో చేసుకునే ఒప్పందాలపై జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. అమెరికాతో టారిఫ్‌ ఒప్పందాలు చేసుకోవడానికి అనేక దేశాలు ఆ దేశంతో తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో టారిఫ్‌ల నుంచి ఉపశమనం కావాలంటే చైనాతో ఆర్థిక బంధాన్ని తెంచుకోవాలని ఆయా దేశాలకు అమెరికా షరతులు పెడుతున్నట్టు రిపోర్టులు వస్తోన్నాయి. బీజింగ్‌తో ఆర్థిక సంబంధాలను తగ్గించుకోవాలని అమెరికా మిత్రదేశాలపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అప్రమత్తమయ్యింది. తమ దేశ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రతీకార చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించింది.
చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోమని పేర్కొంది. తమ నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. ఇతరుల ప్రయోజాలను పణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం మంచిది కాదని సూచించింది. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదని తెలిపింది. స్వల్పకాలిక లాభాల కోసం ఒప్పందాలు చేసుకుంటే అది ఎప్పటికైనా హాని చేస్తుందన్న విషయాన్ని ఆయా దేశాలు గుర్తుంచుకోవాలని సూచించింది. బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదని.. రాజీ పడితే గౌరవం లభించదని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 2 నుంచి ప్రపంచ దేశాలపై అమెరికా భారీగా పన్నులు విధించింది. కాగా.. వాణిజ్య చర్చల పేరిటా వాటిని 90 రోజులు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే చైనాపై మాత్రం క్రమంగా పెంచుతూ 145 శాతం సుంకాలను అమలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రంగా ముదురుతోంది.
యూఎస్‌ సభ్యులపై ఆంక్షలు..
అమెరికాతో చైనా ఢ అంటే ఢ అంటోంది. తాజాగా అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ఎన్‌జీఓ సంస్థల అధిపతులపై చైనా ఆంక్షలు విధించింది. హాంకాంగ్‌కు సంబంధించిన అంశాల్లో అతి ప్రవర్తన కారణంగానే ఈ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పేర్కొంది. గత నెలలో ఆరుగురు చైనా, హాంకాంగ్‌ అధికారులపై అమెరికా ఆంక్షలు విధించడంపై యూఎస్‌ తీరుపై చైనా విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img