– కాశ్మీరీ విద్యార్థులు, వ్యాపారులపై వేధింపులు తగవు : సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి వ్యతిరేకంగా దేశమంతా ఏక తాటిపైకి వచ్చిన వేళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతో సహా వివిధ రాష్ట్రాల్లో ని కాశ్మీరీ విద్యార్ధులను, వ్యాపారులను వేధిస్తున్నట్టు, బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయని, డెహ్రాడూన్‌లో ఇలాంటి బెదిరింపులు, ఒక మత సంస్థ జారీ చేసిన అల్టిమేటమ్ కారణంగా అనేకమంది కాశ్మీరీ విద్యార్ధులు తమ ఇండ్లకు వెళ్ళిపోయారని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. కాశ్మీరీలను, మైనారిటీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విషపూరితమైన ప్రచారం సాగుతోంది. ఇలాంటి చర్యలు కేవలం తీవ్రవాదుల ఎజెండాకు దోహదపడతాయి. ఇలాంటి విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడే వారిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో కోరింది. దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించే వారిని ఉపేక్షించరాదని కోరింది. కాశ్మీరీలందరూ ముక్త కంఠంతో ఉగ్ర దాడిని ఎలా ఖండించారో, ఆ తీవ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ఎలా నిరసనలు తెలియచేశారో యావత్ దేశం చూసిందని పేర్కొంది.
ప్రజా ఐక్యతను రక్షించడానికి కృషి చేయాలి
– కార్మికలోకానికి సీఐటీయూ పిలుపు ఉగ్రదాడికి ఖండన
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడిని సీఐటీయూ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేసింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దారుణమైన దాడి ఉగ్రవాదం నుంచి వచ్చే నిరంతర ముప్పును, శాంతి-సామరస్యంపై దాని వినాశకరమైన ప్రభావాన్ని స్పష్టంగా గుర్తు చేస్తోందని ఈ ప్రకటనలో సీఐటీయూ గుర్తు చేసింది. పర్యాటకులపై జరిగిన ఈ దాడి కారణంగా పర్యాటకం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన అనేక మంది శ్రామిక ప్రజల జీవనోపాధిని నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దుఖ సమయంలో జమ్మూకాశ్మీర్ ప్రజలకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. భయంకరమైన, అనాగరిక నేరానికి ప్పాలడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా సిఐటియు డిమాండ్ చేసింది.
అదేవిధంగా, ఈ దాడి నేపథ్యంలో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఉన్న జమ్మూకాశ్మీర్‌కు చెందిన విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులపై విభజన శక్తులు బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నట్లు వస్తున్న వార్తలపై సిఐటియు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల హింసను కాశ్మీర్ సమాజం ఏకగ్రీవంగా ఖండించినా వారిని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గపు ప్రచారం జరుగుతుందని సిఐటియు తెలిపింది. జమ్మూకాశ్మీర్ ప్రజలపై బెదిరింపులు, హింసాత్మక చర్యలు ఆమోదయోగ్యం కావని, విభజన శక్తులు చేసే ఇటువంటి దుష్ట కార్యకలాపాలు ఉగ్రవాదుల ఎజెండాకు మాత్రమే సహాయపడతాయని సీఐటీయూ హెచ్చరించింది. ఇటువంటి సమయంలో ప్రజల ఐక్యతను రక్షించడానికి, ఉగ్రవాదుల విధ్వంసక కార్యకలాపాలను ఎదుర్కొవడానికి కృషి చేయాలని సీఐటీయూ తన కార్యకర్తలు, సభ్యులు, కార్మికులు, సామాన్య ప్రజలకు పిలుపునిచ్చింది. అలాగే, అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య సంఘాలు అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.
విచ్ఛిన్నకర చర్యలను అణచివేయాలి
- Advertisement -
RELATED ARTICLES