– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
– సమగ్ర అభివృద్ధికి ప్రజాపోరుబాట పాదయాత్ర ప్రారంభం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పదవులున్నా.. లేకున్నా ప్రజల పక్షాన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ.. ప్రభుత్వాలపై అధికారులపై ఒత్తిడి తెచ్చేది ఎర్రజెండా ఒక్కటేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని ఈదులూరు గ్రామంలో ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ‘సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం’ కోసం చేపట్టిన ప్రజాపోరుబాట పాదయాత్రను శనివారం ప్రారంభించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కట్టంగూర్ మండలం సమగ్ర అభివృద్ధి కావాలన్న లక్ష్యంతో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పార్టీ ఈ పాదయాత్ర చేపట్టిందన్నారు. మూసీ ప్రాజెక్టు ద్వారా, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా లిస్టుల ద్వారా కాలువల ద్వారా మండలంలో సుమారు 30 వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉందని వివరించారు. మండలంలో సాగు తాగునీటి వనరులను పూర్తి చేసి నీరందించేందుకు కృషి చేయాలన్నారు. రైతులందరికీ రుణమాఫీ కాలేదని, పెట్టుబడి సాయం లేక ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సన్న రకం దొడ్డు రకం అని చూడకుండా రైతులు పండించిన ప్రతి పంటకూ బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేయాలన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారాలు ఎక్కువయ్యాయని చెప్పారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర బృందం సభ్యులను మెచ్చుకున్నారు. మండుటెండను లెక్క చేయకుండా పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఈ నెల 15న తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి తరలిరావాలని పిలుపునిచ్చారు.
సమస్యలపై పోరాడేది ఎర్రజెండానే..
- Advertisement -
RELATED ARTICLES