Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeనేటి వ్యాసంసమాఖ్య రక్షణ కోసం చారిత్రాత్మక తీర్పు

సమాఖ్య రక్షణ కోసం చారిత్రాత్మక తీర్పు

- Advertisement -

సుప్రీంకోర్టు దేశ సమాఖ్య సూత్రాలను పరిరక్షించే విధంగా నిజమైన ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్ర శాసనసభ సంకల్పాన్ని వమ్ము చేసే విధంగా ఒక గవర్నర్‌ తీసుకునే చర్య ఏదైనా రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిం చింది. న్యాయమూర్తులు జస్టిస్‌ జె.బి.పర్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన 414 పేజీల తీర్పు చాలా ధైర్యవంతమైంది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను తొక్కిపట్టిన గవర్నర్‌ ఆర్యన్‌ రవి రాజ్యాంగ పదవి దుర్వినియోగాన్ని తప్పు పట్టింది.
1994లో ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసులో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన మైలురాయి వంటి తీర్పుల తరహాలోకి చెందే తీర్పు ఇది. రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించటం కోసం 356వ అధికరణాన్ని నిరంకుశంగా ఉపయో గించే పద్ధతికి ఆ తీర్పు స్వస్తి పలికింది. ఆ విషయంలో కూడా గవర్నర్ల నివేదికను సాకుగా తీసుకుని ఈ నిరంకుశ అధికరణాన్ని దుర్వినియోగ పరచటం జరుగుతుండేది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం 356 అధికారంతో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడంగా మారింది.
తొక్కిపట్టిన గవర్నర్‌
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అనుమతినివ్వకుండా నిరవధికంగా తొక్కిపడుతున్న గవర్నర్‌ చర్యకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. రాజ్యాంగం 24వ అధికరణానికి అనుగుణంగా వ్యవహరించేందుకు గవర్నర్‌ నిరాకరించడంపై రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 200 అధికరణం ప్రకారం గవర్నర్‌కు మూడు అవకాశాలు (ఆప్షన్లు) ఉంటాయి. ఒకటి అసెంబ్లీ ఆమోదించిన బిల్లుపై ఆమోదముద్ర వేయటం. లేదా తన ప్రశ్నలతో, వ్యాఖ్యలతో బిల్లును సభకు తిప్పి పంపడం. కాదంటే ఈ బిల్లు రాజ్యా ంగ సూత్రాలను ఉల్లంఘిస్తుందని భావిస్తున్నట్లయితే రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించటం అన్న మూడు పద్ధతుల్లో ఏదో ఒకటి అనుసరించాలి.
ప్రస్తుతం ఈ కేసులోనే పది బిల్లులను తమిళనాడు శాసనసభ ఆమోదించి పంపగా గవర్నర్‌ ఆమోద ముద్ర వేయకుండా అట్టిపెట్టుకున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్‌కు బిల్లులను ఆమోదించటం తప్ప మరో అవకాశం ఏదీ లేదు. అలా చేసే బదులు గవర్నర్‌ ఈ బిల్లులు అన్నింటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. గవర్నర్‌ అనుసరించిన ఈ పద్ధతి చర్య ‘నిజాయితీతో కూడింది కాదని’ కోర్టు తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం ఆయన చర్య తప్పు అని తీర్పు చెప్పింది. కోర్టు ఇంకాస్త ముందుకు వెళ్లి ఈ పది బిల్లులకు ఆమోదంలో లభించినట్టే భావిం చాలని కూడా తీర్పులో ప్రకటించింది. రాజ్యాంగం 200 అధికరణంలోని వివిధ నిబంధనల ప్రకారం గవర్నర్‌ నిర్ణ యం తీసుకోవడానికి పాటించవలసిన కాల వ్యవధిని కూడా నిర్దేశించింది. ఒక బిల్లుకు ఆమోద ముద్ర వేయడం లేదా శాసన సభకు తిప్పి పంపడం అన్నది మూడు మాసాలలోగా జరగాలని కాలవ్యవధి ప్రకటించింది. అలా తిప్పి పంపిన బిల్లును గనుక శాసనసభ మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు వెనక్కు పంపితే ఆమోద ముద్ర వేయవలసి ఉంటుంది. గవ ర్నర్‌ ఒక నిర్ణయం తీసుకునే విషయమై రాజ్యాంగంలోని అస్పష్టతను ఈ ఆదేశాల ద్వారా సుప్రీంకోర్టు భర్తీ చేసింది.
పరిశీలన తంతుకూ పగ్గాలు
రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం పంపే విషయమై కూడా కోర్టు సకాలంలో సాహసోపేతమైన ఆదేశం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకునే రాజ్యాంగ సాధనాల్లో ఒకటిగా ఇప్పుడు ఈ ప్రక్రియ ఉంటుంది. గవర్నర్లు బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించడం, తర్వాత కేంద్రం హుకుంల ప్రకారం నడుచుకోవడం దాని చేతుల్లో ఒక పనిముట్టుగా మారింది.
కేరళ పోరాటం
ఈ తీర్పు కేవలం తమిళనాడుకే కాకుండా అన్ని రాష్ట్రాలకు ఒక విజయం. కేరళ, కర్నాటక, పంజాబ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా గవర్నర్లు తొక్కి పడుతున్నారు. కేరళ మాజీ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఇదేవిధంగా తొక్కి పట్టిన విషయమై ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిట్‌ పిటిషన్‌ వేసింది. ఏప్రిల్‌ 8న తమిళనాడు పిటిషన్‌పై తీర్పు రాగానే కేరళ ప్రభుత్వ న్యాయవాది తమ పిటిషన్‌ కూడా అదే ధర్మాసనం విచారించాలని కోరారు. అయితే రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకోకుండా అట్టిపెట్టినందున కేరళ అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమోదించలేదు. దాన్ని మే 13న విచారణకు నిర్ణయించారు. కేరళ గవర్నర్‌ ఇదేవిధమైన చర్యలకు పాల్పడ్డారు. కనుక కేరళ పిటిషన్‌ కూడా ఇదే ధర్మాసనం విచారించి ఉంటే మరింత బాగుండేది.
కేంద్రం బాధ్యత
కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రాత్మకమైన తీర్పుకు అనుగుణంగా కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది. గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించేలా పురికొల్పడం మానుకోవాలి. కేరళకు కొత్తగా వచ్చిన గవర్నర్‌ అప్పుడే సుప్రీంకోర్టు తీర్పును ‘రాజ్యాంగ అతిక్రమణ’గా అభివర్ణించారు. ఈ విషయమై రాజ్యాంగ ధర్మాసనం వినాలనే కోర్కెలు కూడా వినిపిస్తున్నాయి. ఈ తీర్పును వమ్ము చేసేందుకు జరుగుతున్న అలాంటి ప్రయత్నాలన్నిటిని అడ్డు కోవాలి. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ విపరీత కేంద్రీకరణ దిశలో సాగుతున్న పోకడలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇదొక మైలురాయి వంటి తీర్పు. రాజ్యాంగ సమాఖ్య సూత్రాలను కాపాడుకోవడానికి సకల ప్రయత్నాలు జరగాల్సిందే.
(ఏప్రిల్‌ 16 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad