Wednesday, April 30, 2025
Homeజాతీయంసివిల్స్‌లో సత్తాచాటిన మహిళలు

సివిల్స్‌లో సత్తాచాటిన మహిళలు

– టాప్‌ 5లో ముగ్గురు, టాప్‌ 25లో 11 మంది మగువలే
– ఫలితాలు ప్రకటించిన యూపీఎస్‌సీ
న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో నియా మకాల కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) నిర్వహించిన సివిల్స్‌ – 2024 తుది ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో మహిళా అభ్య ర్థులు సత్తా చాటారు. ప్రథమ, ద్వితీయ ర్యాంకులతో పాటు టాప్‌ 5 ర్యాంకుల్లో ముగ్గురు, సివిల్స్‌లో సత్తా చాటిన మహిళలు టాప్‌ 25 ర్యాంకుల్లో 11 మంది మహిళలే జయకేతనం ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన పలువురు విద్యార్థులు కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. గతేడాది జూన్‌ 16న జరిగిన సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు దేశ వ్యాప్తంగా 9,92,599 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,83,213 మంది మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో సెప్టెంబర్‌లో జరిగిన మెయిన్స్‌ రాత పరీక్షకు 14,627 మంది ఉత్తీర్ణత సాధించగా..వీరిలో వ్యక్తిగతంగా మౌఖిక పరీక్షకు 2,845 మంది ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో 1,009 మంది అభ్యర్థులను వివిధ సర్వీసుల్లో నియామకాలకు యుపిపిఎస్‌సి ప్రతిపాదించింది. వీరిలో 725 మంది పురుషులు కాగా, 284 మంది మహిళలు ఉన్నారు. వీరిలో జనరల్‌ కేటగిరీలో 335 మంది, ఇడబ్ల్యుఎస్‌ నుంచి 109, ఒబిసి నుంచి 318, ఎస్‌సి కేటగిరీలో 160, ఎస్‌టి కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఉన్నారు.
టాప్‌ -10 ర్యాంకర్లు వీరే..
ఈ ఏడాది సివిల్స్‌ తుది ఫలితాల్లో మహిళలు అదరగొట్టారు. ప్రథమ, ద్వితీయ ర్యాంకులతో పాటు టాప్‌ 5 ర్యాంకుల్లో ముగ్గురు, టాప్‌ 25 ర్యాంకుల్లో 11 మంది మహిళలు విజయదుందుబి మోగించారు. శక్తి దూబే ప్రథమ ర్యాంకుతో సత్తా చాటగా.. హర్షిత గోయల్‌ (2), అర్చిత్‌ పరాగ్‌ (3), షా మార్గి చిరాగ్‌(4), ఆకాశ్‌ గార్గ్‌ (5), కోమల్‌ పునియా(6), ఆయుషీ బన్సల్‌(7), రాజ్‌కష్ణ ఝా(8), ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌ (9), మయాంక్‌ త్రిపాఠి(10) ర్యాంకుల్లో మెరిశారు.
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఇ.సాయి శివాని 11వ ర్యాంకుతో మెరిశారు. ఆమె వరంగల్‌లోని శివనగర్‌కు చెందిన రాజు, రజిత దంపతుల ప్రథమ పుత్రిక. తండ్రి మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన టిజిపిఎస్‌సి గ్రూప్‌ పరీక్షలో జోనల్‌వైజ్‌లోనూ 11వ ర్యాంకు సాధించిన సాయి శివాని.. సివిల్స్‌ ఫలితాల్లోనూ అదే ర్యాంకుతో సత్తా చాటడం విశేషం.
అలాగే, సివిల్స్‌ ఫలితాల్లో బాన్న వెంకటేశ్‌ 15వ ర్యాంకు సాధించారు. 2023లో సివిల్స్‌ ఫలితాల్లో 467వ ర్యాంకు సాధించిన వెంకటేశ్‌ ప్రస్తుతం.. హైదరాబాద్‌లో ఐపిఎస్‌ శిక్షణ తీసుకుంటున్నారు. మరోవైపు అభిషేక్‌ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్‌ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్‌ 68, ఎన్‌ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డి 119, చల్లా పవన్‌ కల్యాణ్‌ 146, ఎన్‌.శ్రీకాంత్‌ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకష్ణసాయి 190వ ర్యాంకులతో అదరగొట్టారు.
టాప్‌ 5 ర్యాంకర్ల నేపథ్యం
8శక్తి దూబే అలహాబాద్‌ విశ్వవిద్యాలయం నుంచి బయో కెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. సివిల్స్‌ మెయిన్స్‌లో ఆమె పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని సత్తా చాటారు. శక్తి దూబే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు. యూనివర్సిటీ ఆఫ్‌ అలహాబాద్‌ నుంచి బ్యాచిలర్స్‌ పూర్తి చేశారు. అనంతరం బయో కెమిస్ట్రీలో పిజి చేసేందుకు బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి వెళ్లారు. 2018 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమై జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నారు.
8హర్షిత గోయల్‌ ఎంఎస్‌ యూనివర్సిటి ఆఫ్‌ బరోడా నుంచి బికామ్‌ గ్రాడ్యుయేట్‌. హర్షిత సైతం పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ను ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని సివిల్స్‌లో రెండో ర్యాంకుతో అదరగొట్టారు.
8డోంగ్రే అర్చిత్‌ పరాగ్‌ వెల్లూరులోని విట్‌ నుంచి ఇంజినీరింగ్‌ చేశారు. ఫిలాసఫీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని అతను మూడో ర్యాంకుతో సత్తా చాటారు.
8షా మార్గి చిరాగ్‌ అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌లో బిఇ పూర్తి చేశారు. సివిల్స్‌లో సోషియాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొన్న ఆమె.. నాలుగో ర్యాంకుతో సత్తా చాటారు.
8ఆకాశ్‌ గార్గ్‌ దిల్లీలోని గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో బిటెక్‌ పూర్తి చేశారు. సోషియాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకొని ఐదో ర్యాంకు దక్కించుకున్నారు.
టాప్‌ 25 ర్యాంకర్లలో 14 మంది పురుషులు కాగా.. 11 మంది మహిళలు. వీరంతా దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటి, ఎన్‌ఐటి, విఐటి, జెఎన్‌యు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, అలహాబాద్‌ విశ్వ విద్యాలయాల నుంచి ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌, సైన్స్‌, కామర్స్‌, మెడికల్‌ సైన్స్‌, ఆర్కిటెక్చర్‌ వంటి కోర్సుల్లో గ్రాడ్యుయేషన్‌ చేసినవారు కావడం విశేషం. అలాగే, మెయిన్స్‌ రాత పరీక్షల్లో విజయం సాధించిన టాప్‌ 25 మంది అభ్యర్థులు ఆంత్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, జాగ్రఫీ, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, సోషియాలజీ, తమిళ భాషా సాహిత్యంతో సహా పలు సబ్జెక్టులను ఆప్షన్స్‌గా ఎంచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img