– వాణిజ్య భాగస్వాములకు ట్రంప్ హెచ్చరిక
– జిన్‌పింగ్‌తో సంభాషణపై మౌనం
వాషింగ్టన్: తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై నిన్నటి వరకూ ప్రతీకార చర్యలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా సుంకాలు కాకుండా ఇతరత్రా విషయాలలో తమను మోసగిస్తున్న దేశాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగారు. వివిధ చర్యల ద్వారా తమను మోసం చేస్తే అమెరికాతో సంబంధాలు దెబ్బతింటాయని ఆయా దేశాలను హెచ్చరించారు. ఈస్టర్ పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పే ఆనవాయితీకి స్వస్తి చెప్పిన అమెరికా అధ్యక్షుడు ఆ పర్వదినం రోజు ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేశారు. కొన్ని దేశాలు సుంకాలు కాకుండా ఎనిమిది రకాలుగా తమను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. కొన్ని ప్రపంచ వాణిజ్య భాగస్వామ్య దేశాలు అమెరికాతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు.ఇంతకీ ట్రంప్ చెబుతున్న ఆ ఎనిమిది అంశాలు ఏమిటంటే…కొన్ని దేశాలు అవాంఛనీయ వాణిజ్య ప్రయోజనాలు పొందడానికి అమెరికా కరెన్సీ మారకపు రేటును కృత్రిమంగా ప్రభావితం చేస్తున్నాయని, తమ వస్తువులను తక్కువ రేటుతో అమెరికాలో డంపింగ్ చేస్తున్నాయని, ఎగుమతి సబ్సిడీలు-ఇతర సబ్సిడీలు ఇస్తున్నాయని, రక్షణాత్మక వ్యవసాయ-సాంకేతిక ప్రమాణాలు పాటిస్తున్నాయని, నకిలీ-పైరసీ-ఐపీ దొంగతనానికి పాల్పడుతున్నాయని, సుంకాల ఎగవేతకు సరుకులను ఒక ఓడ నుండి మరో ఓడలోకి మారుస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా అమెరికాతో సంబంధాలను ఆయా దేశాలు చేజేతులా నాశనం చేసుకుంటున్నాయని తెలిపారు.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్‌లో ఈ విధంగా బెదిరింపు పోస్ట్ పెట్టడం గమనార్హం. చైనాతో త్వరలోనే సుంకాలపై ఒప్పందం కుదురుతుందని, తెర వెనుక ఆ దేశంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో నేరుగా మాట్లాడుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన నుండి మౌనమే సమాధానమవుతోంది. సుంకేతర మోసాలకు పాల్పడుతున్న దేశాలతో వాణిజ్య సంబంధాల విషయంలో అసమతుల్యత ఏర్పడుతుందని, సుంకాలపై ప్రకటించిన 90 రోజుల విరామం తర్వాత అమెరికాతో ఆ అంతర్జాతీయ భాగస్వాముల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని ట్రంప్ భావిస్తున్నారు. జపాన్ చేపట్టిన రక్షణాత్మక సాంకేతిక ప్రమాణాలను ట్రంప్ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కన్పిస్తోంది. వాస్తవానికి 2018లోనే జపాన్‌పై ఆయన ‘బౌలింగ్ బాల్ టెస్ట్’ ఆరోపణలు చేశారు. బౌలింగ్ బాల్ టెస్ట్ అంటే క్రికెట్ లేదా టెన్నిస్‌లో బంతి నాణ్యత, పనితీరును పరీక్షించేందుకు చేసే పరీక్ష. ‘జపాన్ చేస్తున్నది బౌలింగ్ బాల్ టెస్ట్. వారు గాలిలో 20 అడుగుల ఎత్తు నుండి బౌలింగ్ బాల్‌ను తీసుకొని కారుపై వేస్తారు. కారు పైభాగం పగిలిపోతే అది ఎందుకూ పనికిరాదు. ఈ చర్య భయానకం’ అని అప్పుడు ట్రంప్ ఆరోపణలు చేశారు. అమెరికా వాహనాల దిగుమతులను నిరోధించడానికి జపాన్ ఇలా వ్యవహరిస్తోందని ఆయన పరోక్షంగా నిందించారు. అయితే దీనిపై అప్పటి అధ్యక్ష భవనం ప్రెస్ కార్యదర్శి సారా సాండర్స్ మాట్లాడుతూ ట్రంప్ జోక్ చేస్తున్నారని అన్నారు.
సుంకేతర చర్యలతో మోసం చేస్తే సంబంధాలు దెబ్బతింటాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES