– బీజేపీ ఎంపీ దూబే వ్యాఖ్యలపై స్పందించిన ఖురేషి
న్యూఢిల్లీ: వ్యక్తులను వారు చేసిన సేవలను బట్టి నిర్వచించాలి కానీ వారి మతాలను బట్టి కాదని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎస్.వై. ఖురేషి సోమవారం వ్యాఖ్యానించారు. బిజెపి ఎంపి నిషికాంత్ దూబే తనను ముస్లిం కమిషనర్‌గా అభివర్ణించడంపై ఆయన పై రీతిలో స్పందించారు. ”మన రాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీ కల్పించింది. ఎవరైనా ఏం మాట్లాడాల నుకుంటే అది మాట్లాడవచ్చు.” అని ఖురేషి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ అన్నారు. వక్ప్ చట్టంపై చేసిన ప్రకటనకు కట్టుబడి వుంటారా అని ప్రశ్నించగా, కచ్చితంగా అని బదులిచ్చారు. 2010 జులై నుండి 2012 జూన్ వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఆయన పని చేశారు. ముస్లిం భూములను కబళించడానికి ప్రభుత్వం పన్నిన దారుణమైన దుష్ట పన్నాగమే ఈ వక్ప్ చట్టం అని ఖురేషి పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 17న ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనిపై కచ్చితంగా సుప్రీం స్పందిస్తుందని ఆయన అన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే పనిని తప్పుడు ప్రచార యంత్రాంగం చక్కగా చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్‌గా రాజ్యాంగబద్ధమైన పదవిని నా శాయశక్తులా నిర్వహించాను. ఐఏఎస్‌గా సుదీర్ఘమైన, సంతృప్తికరమైన కెరీర్ గడిపాను. భారతదేశ భావజాలం పట్ల నాకు పూర్తిగా విశ్వాసం వుంది. ఇక్కడ ఒక వ్యక్తిని వారు చేసిన సేవల ద్వారా నిర్వచిస్తారు తప్ప, వారి మతపరమైన గుర్తింపుల ద్వారా కాదు.” అని సోమవారం పీటీఐతో మాట్లాడుతూ ఖురేషి వ్యాఖ్యానించారు. ”కానీ కొంతమందికి, మతపరమైన గుర్తింపులనేవి వారి విద్వేష రాజకీయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కీలకమైనవని నేను భావిస్తున్నాను. భారతదేశం ఎల్లప్పుడూ తన రాజ్యాంగబద్ధమైన సంస్థలు, సూత్రాల పట్ల నిబద్ధతతో వ్యహరిస్తుంది.” అని ఆయన పేర్కొన్నారు. దేశంలో అంతర్యుద్ధాలకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా బాధ్యుడంటూ దూబే చేసిన ప్రకటనకు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని బిజెపి స్పష్టం చేసింది, అది జరిగిన కొద్ది గంటలకే ఆదివారం ఉదయం దూబే మాజీ సీఈసీపై మాటలతో దాడి చేశారు. వక్ఫ్ చట్టాన్ని ఆయన విమర్శించడమే ఈ దాడికి కారణం. అందుకని ఆయనను ముస్లిం కమిషనర్‌గా ముద్ర వేసేశారు. అంతకుముందు రోజే సుప్రీం కోర్టుపై, సిజెఐ సంజీవ్‌ఖన్నాపై కూడా ఇలాగే తీవ్రంగా విమర్శలు చేశారు.
సేవలను బట్టి చూడాలి.. మతాన్ని బట్టి కాదు
- Advertisement -
- Advertisement -