Tuesday, April 29, 2025
Homeఅంతర్జాతీయంస్వదేశీ నేరగాళ్లపై ట్రంప్ కన్ను… విదేశీ జైళ్లకు పంపే ఆలోచనలో అమెరికా

స్వదేశీ నేరగాళ్లపై ట్రంప్ కన్ను… విదేశీ జైళ్లకు పంపే ఆలోచనలో అమెరికా

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రతిపాదన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా పౌరులైన కొందరు తీవ్ర నేరస్థులను విచారణ అనంతరం మధ్య అమెరికా దేశమైన ఎల్ సాల్వడార్‌లోని జైళ్లకు పంపే ఆలోచనను ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనపై రాజ్యాంగ నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలేతో జరిగిన సంభాషణలో ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. అమెరికాలో జైళ్ల స్థలానికి కొరత ఉందని, “స్వదేశీ నేరగాళ్లను” ఎల్ సాల్వడార్‌లోని అతిపెద్ద జైలు CECOTకు పంపే అవకాశం గురించి మాట్లాడినట్లు తెలిసింది. అయితే, ఇది చట్టబద్ధమైతేనే ముందుకు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అత్యంత క్రూరమైన, పదే పదే నేరాలకు పాల్పడే అమెరికన్లను మాత్రమే, అదీ చట్టం అనుమతిస్తేనే, ఈ విధంగా పంపే విషయాన్ని పరిగణిస్తామని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. మరోవైపు, అమెరికా పౌరులను ఇలా విదేశీ జైళ్లకు పంపడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. పౌరులను బహిష్కరించడానికి అమెరికా చట్టాల్లో ఎలాంటి అధికారం లేదని వారు నొక్కి చెబుతున్నారు. ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు బుకెలే మాత్రం అమెరికా ఖైదీలను స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేశారు. తమ వద్ద అందుకు సరిపడా స్థలం ఉందని ఆయన చెప్పినట్లు తెలిసింది. గతంలో కూడా రుసుము తీసుకుని అమెరికా ఖైదీలను తమ దేశ జైళ్లలో ఉంచడానికి బుకెలే ముందుకొచ్చారు. అప్పట్లో ఎలాన్ మస్క్ వంటి వారు ఈ ఆలోచనను సమర్థించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img