– అక్కల బస్తి, బీసీ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, హమాలి కాలనీలలో ఇళ్లలోకి మోకాళ్ళ లోతు చేరిన వరద నీరు
– తీవ్ర ఇబ్బందులు పడుతున్న పట్టణ ప్రజలు
– వరద నీటి ప్రవాహంతో రామాయంపేటకు ఆగిపోయిన రాకపోకలు
– వరదలో చిక్కుకున్న భవనం నుండి 300 మంది విద్యార్థులను కాపాడిన పోలీసులు, ఫైర్ సిబ్బంది
నవతెలంగాణ – రామాయంపేట: అతిభారీ వర్షాలతో రామాయంపేట అతలాకుతరం అయింది. రాత్రి రెండు గంటల నుండి ఏకధాటిగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు రామాయంపేట పట్టణంలోని చాలా కాలనీలు జలమయమయ్యాయి. మోకాలలో నీళ్లు చేరి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అటు కామారెడ్డి, హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి వరద నీటి తాకిడికి రాకపోకలు ఆగిపోయాయి. వరద నీటి తాకిడికి సిద్దిపేట రోడ్డు, దౌల్తాబాద్ రోడ్డులో కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. రామాయంపేట పట్టణంతో పాటు పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలోని అక్కల బస్తీ, బీసీ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, హమాలి కాలనీలతో పాటు మంజీరా స్కూల్ పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అక్కల బస్తీలోని ఇళ్లలోకి మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అతిభారీ వర్షంతో అతలాకుతలం
రామాయంపేటలో బుధవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 4:00 గంటల వరకు 16.30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతుండగా, మంగళవారం రాత్రి 2 గంటల నుండి ఉదయం 8:00 వరకు కురిసిన భారీ వర్షంతో కలుపుకుంటే సుమారు 25 సెంటీమీటర్ల పైగా వర్షపాతం కురిసి ఉండొచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ అనూహ్య వర్షానికి రామాయంపేట పట్టణంతో పాటు పలు గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
కొచ్చేరువు అలుగు పారి విద్యార్థుల అవస్థలు

పట్టణంలోని కొచ్చేరువు భారీగా అలుగు పారడంతో, వరద నీరు మహిళా డిగ్రీ కళాశాల భవనం చుట్టూ చేరింది. దీంతో 350 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవనంలో చిక్కుకున్న విద్యార్థినులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కొచ్చేరువు వరద ఉధృతికి రామాయంపేట-కామారెడ్డి రోడ్డులోని స్టేట్ బ్యాంక్ ప్రాంతంలో నడుము లోతు వరకు నీరు చేరి రాకపోకలు స్తంభించాయి.
పాండ చెరువు వరదతో రాకపోకలు బంద్

పట్టణంలోని పాండ చెరువు కూడా అలుగు పారడంతో దాని వరద ప్రవాహం దౌల్తాబాద్, సిద్దిపేట రోడ్ల మీదుగా సాగింది. దౌల్తాబాద్ రోడ్డులోని కళ్ళు డిపో వద్ద, సిద్దిపేట రోడ్డుపై కూడా మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచిపోయింది. ఈ వరద ధాటికి సిద్దిపేట రోడ్డు కొంతమేర కొట్టుకుపోయింది. దీంతో సిద్దిపేట, దౌల్తాబాద్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
పలు గ్రామాలకు రాకపోకలు బంద్

మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరగా, దొంగల ధర్మారం పెద్ద చెరువు అలుగు పారడంతో ఆ గ్రామంలోని రోడ్డు ధ్వంసమై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అదే విధంగా, కాట్రియాల సమీపంలోని పుష్పాల వాగు పొంగిపొర్లడంతో పాటు, తిప్పాపూర్ పెద్దచెరువుకు భారీగా నీరు చేరడంతో రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.ఈ మూడు గ్రామాల తోపాటు, పలు గిరిజన తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ గ్రామాల నుండి ఎక్కడికి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.భారీ వర్షాలు, వరదల కారణంగా మండలంలోని ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరుతున్నారు.
సహాయక చర్యల్లో అధికారులు

అకస్మాత్తుగా రామాయంపేటలో అతి భారీ వర్షాలు పడడంతో, రెవేన్యూ, పోలీసు, ఫైర్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్, ఎస్ఐ బాలరాజు నేతృత్వంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది విద్యార్థులను వరదలో చిక్కుకున్న భవనం నుండి, తాళ్ల సహాయంతో బయటకు తీసుకురావడాన్ని పలువురు అభినందిస్తున్నారు. తహసిల్దార్ రజనీకుమారి నేతృత్వంలో రెవెన్యూ అధికారులు, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.