Tuesday, April 29, 2025
Navatelangana
Homeజాతీయంహెల్త్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌

హెల్త్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌

- Advertisement -

– అందరికీ ఆరోగ్యం ఉత్తిదే!
– ప్రజారోగ్యం పట్టని మోడీ సర్కార్‌
– ప్రయివేటుకే పెద్దపీట
– నామమాత్రంగా బడ్జెట్‌ కేటాయింపులు
న్యూఢిల్లీ:
దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజానీకానికి ఆరోగ్య భద్రత కరువైంది. ఈ వ్యవస్థను పాలకులు ప్రయివేటు పరం చేస్తుండడంతో అందరికీ వైద్యం అందని ద్రాక్ష పండుగానే మిగిలిపోతోంది. ప్రజారోగ్య వ్యవస్థకు ప్రభుత్వ పెట్టుబడులు నానాటికీ తరిగిపోతున్నాయి. దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య రక్షణ కల్పించాలని, అది సార్వత్రికం కావాలని 1946లో భోరే కమిటీ ఇచ్చిన నివేదిక చెత్తబుట్టలో చేరిపోయింది. కేంద్ర బడ్జెట్‌లో పదిహేను శాతాన్ని ఆరోగ్య రంగానికి కేటాయించాలని ఆ కమిటీ సూచించింది. అయితే కమిటీ చేసిన కొన్ని సూచనలు అసలు అమలుకే నోచుకోకపోగా కొన్ని పాక్షికంగా అమలవుతున్నాయి. ఆరోగ్య భద్రతలో అసమానతలు మాత్రం బాగా పెరిగిపోతున్నాయి.
ఖరీదైన వ్యాధి సోకితే…
గ్రామాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కానీ, జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులలో కానీ కనీస సౌకర్యాలు కన్పించడం లేదు. సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రజారోగ్యానికి బడ్జెటరీ కేటాయింపులు నామమాత్రంగా ఉండడడమే దీనికి కారణం. వ్యాక్సిన్లు, గర్భిణులు-శిశువులకు ఆరోగ్య సేవలు, పారిశుధ్యం వంటి కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న మాట నిజమే. అయితే వ్యాధి వచ్చిన తర్వాత దానిని నయం చేయడం పైనే ఎక్కువ శ్రద్ధ కన్పిస్తోంది. సంపన్నులకు మాత్రమే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. వెనుకబడిన తరగతుల వారికి, మధ్య తరగతి జీవులకు మాత్రం అవి ఎండమావిగానే కన్పిస్తున్నాయి. ఖరీదైన వ్యాధి సోకిందంటే జేబులు ఖాళీ కావాల్సిందే. ఉన్నవన్నీ ఆమ్ముకొని రోడ్డున పడాల్సిందే. ఓ వైపు ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి నిధుల కేటాయింపులో అలసత్వం ప్రదర్శిస్తోంటే మరోవైపు నియంత్రణ లేని ప్రైవేటు రంగం లాభార్జనే ధ్యేయంగా ప్రజలను పీల్చి పిప్పి చేస్తోంది.
వస్తు సేవగా మారిన ప్రజారోగ్యం
1983లో కేంద్ర ప్రభుత్వం తొలి జాతీయ ఆరోగ్య విధానాన్ని (ఎన్‌హెచ్‌పీ) విడుదల చేసింది. ఆరోగ్య రంగంలో ప్రయివేటు రంగం ప్రవేశానికి అది తలుపులు తెరిచింది. అదే సమయంలో ప్రజారోగ్య రక్షణ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల కేటాయింపులు తగ్గిపోవడం మొదలైంది. 1992-97లో వచ్చిన ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక ప్రజారోగ్యంలో యూజర్‌ చార్జీలను ప్రవేశపెట్టింది. అది ప్రజారోగ్యాన్ని వస్తు సేవగా మార్చేసింది. ప్రపంచబ్యాంక్‌ ఇచ్చిన యూజర్‌ చార్జీల సూచనను ఆ తర్వాతి దశాబ్ద కాలంలో అనేక రాష్ట్రాలు అమలు చేశాయి. 2010 నాటికి ప్రజారోగ్యంపై ప్రభుత్వ వ్యయం జీడీపీలో రెండు శాతానికి చేర్చాలని 2002వ సంవత్సరపు జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యంగా నిర్దేశించింది. అదే సమయంలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని స్వాగతించింది.
ప్రయివేటు భాగస్వామ్యంతో ఏబీ-పీఎంజేఏవై
ఇక చివరిసారిగా 2017లో కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీని జారీ చేసింది. ఇప్పుడు అమలులో ఉన్న ఆయుష్మాన్‌ భారత్‌-ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)కి దారులు వేసింది ఆ విధానమే. 2025 నాటికి ప్రజారోగ్యానికి కేంద్ర నిధులను జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని కూడా సూచించింది. ఇందులో మూడింట రెండు వంతుల సొమ్మును ప్రాథమిక ఆరోగ్య రక్షణకు వినియోగించాలని చెప్పింది. అంతేకాక ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని కూడా తెలిపింది. ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో ప్రభుత్వంతో కలిసి ప్రయివేటు రంగం ఆరోగ్య సేవలు అందిస్తోంది. గతంలో పీహెచ్‌లుగా పిలిచే కేంద్రాల స్థానంలో ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లు లేదా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.ఇవన్నీ ఎబీ-పీఎంజేఏవై కిందే పనిచేస్తున్నాయి. భారతీయ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), నాతెల్త్‌ వంటి సంస్థలు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందజేస్తున్నాయి.
అందరికీ ఆరోగ్యం అందేనా?
లాభాపేక్షే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రయివేటు ఆస్పత్రులను ఏబీ-పీఎంజేఏవైలో భాగస్వాములను చేయడం, వాటిపై నియంత్రణ లేకపోవడం వంటి కారణాల వల్ల దేశంలో ఆరోగ్య సంరక్షణ ఎంత ప్రమాదంలో పడుతోందో అర్థం చేసుకోవచ్చు. పైగా సామాజిక, ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్న మన దేశంలో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి దానిని పట్టించుకోకపోవడంతో అందరికీ ఆరోగ్య హక్కు లభిస్తుందా అన్నది సందేహాస్పదంగానే ఉంది.

పథకంలో పరిమితులు
ఆరోగ్య రంగంలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని నిటి ఆయోగ్‌ కూడా ప్రశంసిస్తోంది. అయితే ప్రయివేటు వైద్య సేవలు చౌకగా, అందరికీ లభించడం లేదని, ఆయా సంస్థల పెట్టుబడులన్నీ లాభాలు, అభివృద్ధి పైనే దృష్టి సారిస్తున్నాయని 2022లో ప్రచురించిన శేతపత్రంలో తెలిపింది. అయితే ఈ సవాళ్లను ఏబీ-పీఎంజేఏవై ఎదుర్కోగలుగుతుందా? ఆరోగ్యానికి సంబంధించిన రాజ్యాంగ హక్కు పూర్తి స్థాయిలో సాకారం అవుతుందా అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు దొరకడం లేదు. ఏబీ-పీఎంజేఏవైకి పరిమితులు ఉన్నాయి. అర్హతపై ఈ పథకం ఆంక్షలు విధిస్తోంది. ఇటీవలే సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధంలేకుండా ఈ పథకాన్ని 70 సంవత్సరాల పైబడిన వారందరికీ వర్తింపజేశారు. ఈ పథకం అందించే ప్యాకేజీలు గణనీయమైనవే అయినప్పటికీ సమగ్రమైనవి మాత్రం కావు. కొన్ని వైద్య చికిత్సలు, పద్ధతులను దీని నుంచి మినహాయించారు. ఈ లోపాలనే ప్రయివేటు రంగం తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోంది. దీంతో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్న ఈ దేశంలో అందరికీ ఆరోగ్యం అనే మాట నీటి మూటగానే మిగిలిపోతోంది.
పైగా ఈ పథకం ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 34,678 ఆస్పత్రులకు అనుమతి ఉంది. వీటిలో 43 శాతం ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రులే. ఈ పథకం నుంచి 2018 తర్వాత 600 ప్రయివేటు ఆస్పత్రులు వైదొలిగాయని ఓ నివేదిక చెబుతోంది. మరి జాబితాలో లేని వేలాది ప్రయివేటు ఆస్పత్రుల మాటేమిటి? వాటిని ఎలా నిర్వహిస్తారు? ప్రయివేటు ఆరోగ్య సంరక్షణ రంగంలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం చట్టం ఉన్నప్పటికీ దాని అమలు సరిగా లేదు. పైగా కేవలం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మాత్రమే అది అమలులో ఉంది. తనిఖీలు, చర్యలు కూడా నామమాత్రంగానే ఉంటున్నాయి. కోవిడ్‌ సమయంలో అనేక ప్రయివేటు ఆస్పత్రులు ప్రజలను ఏ విధంగా దోచుకున్నదీ తెలిసిందే.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు