నవతెలంగాణ-హైదరాబాద్ : తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. నగరంలోని చైతన్యపురిలో ఓ వ్యక్తి వద్ద గంజాయి లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వాటిని విక్రయిస్తున్న వ్యక్తులు చిక్కారు. వారి నుంచి 11.5కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చైతన్యపురిలో భూక్య శ్రీకాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి అతడి నుంచి 340 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అది ఎక్కడ నుంచి వచ్చిందని అతడిని ప్రశ్నించినప్పుడు అబ్బాస్ అనే వ్యక్తి వద్ద నుంచి తీసుకొచ్చానని నిందితుడు చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారంతో అతడి ఇంటికి వెళ్తే 850 గ్రాముల గంజాయి లభించింది. పోలీసులు అతడిని కూడా అరెస్టు చేసి విచారించారు. రెండో నిందితుడిని ఆరా తీయగా.. నడిమింటి మమత అనే మహిళ ఇంట్లో 10.693 కిలోల గంజాయి పట్టుబడింది. వీటి విలువ రూ.6లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ రెండు కేసుల్లో నలుగురిపై కేసు నమోదు చేశామని, ముగ్గురిని అరెస్టు చేయగా.. ఒకరు పరారీలో ఉన్నారని చెప్పారు.