నవతెలంగాణ – హైదరాబాద్: మారథాన్ ను పూర్తి చేసిన అత్యధిక వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన పౌజా సింగ్ ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సోమవారం జలంధర్ – పఠాన్ కోట్ జాతీయ రహదారిపై ఆయనను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఫౌజా సింగ్ ను స్థానికులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో ఫౌజా సింగ్ తలకు తీవ్ర గాయమైందని, రక్తస్రావం కారణంగా ఆయన తుదిశ్వాస వదిలారని వైద్యులు ప్రకటించారు.
విదేశాల్లో ఉంటున్న ఆయన పిల్లలు వచ్చే వరకూ ఫౌజా సింగ్ మృతదేహాన్ని మార్చురీలో ఉంచుతామని వారు చెప్పారు. పంజాబ్ లోని జలంధర్ జిల్లా బేయాస్ గ్రామంలో 1911 ఏప్రిల్ 1న ఫౌజా సింగ్ జన్మించారు. ఆయనకు ప్రస్తుతం 114 ఏళ్లు. భార్య, కొడుకు మరణం తర్వాత ఫౌజా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు. 89 ఏళ్ల వయసులో మొదలు పెట్టిన పరుగును వందేళ్లు దాటినా ఆపలేదు. ఈ వయసులోనూ ఫౌజా సింగ్ ఉత్సాహంగా పరుగులు తీసిరికార్డులకెక్కారు. పలు మారథాన్లను పూర్తిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. లండన్, న్యూయార్క్, టొరంటో లలో జరిగిన మారథాన్ లలో ఫౌజా సింగ్ పాల్గొన్నారు. ఫౌజా సింగ్ మరణంపై పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా విచారం వ్యక్తం చేశారు. వందేళ్లు దాటినా ఉత్సాహంగా పరుగులు తీస్తూ యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని ఆయన అన్నారు.