Monday, May 5, 2025
Homeజాతీయం12కోట్ల మందికి అందని సబ్సిడీ రేషన్‌

12కోట్ల మందికి అందని సబ్సిడీ రేషన్‌

- Advertisement -

– జనగణనలో జాప్యంతో పీడీఎస్‌కు దూరమవుతున్న పేదలు
– పెరుగుతున్న ఆహార అభద్రత
– పోషకాహార లోపంతో ఎదుగుదల కోల్పోతున్న చిన్నారులు
దేశంలో జనగణన ఇప్పటికే నాలుగేండ్లు ఆలస్యమైంది. ఈ ప్రక్రియకు బడ్జెట్‌ కేటాయింపులను ప్రభుత్వం తగ్గిస్తోంది. ఫలితంగా జనాభా లెక్కల సేకరణలో మరింత జాప్యం జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. జనగణనలో జరుగుతున్న ఆలస్యం కారణంగా లక్షలాది మంది ప్రజలు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు పొందలేక తీవ్రమైన అభద్రతా భావానికి గురవుతున్నారు. చిన్నారులు పోషకాహార లోపంతో ఎదుగుదలను కోల్పోతూ కుంగుబాటుకు లోనవుతున్నారు.
న్యూఢిల్లీ:
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద 80.6 కోట్ల మందికి సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తోంది. ఇది దాని సొంత అంచనాల కంటే కూడా 81 లక్షలు తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం మంది రేషన్‌ పొందుతున్నారు. అయినప్పటికీ లక్షలాది మందికి ఆహార భద్రత అందడం లేదా అని పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రశ్నించినప్పుడు తదుపరి జనగణన డేటా ప్రచురితమైన తర్వాతే ఆ లెక్క తేలుతుందని ప్రభుత్వం బదులిచ్చింది.
ఐదేండ్లు ఆలస్యంగా…
జనగణనతో పాటే కులగణన కూడా జరుపుతామని గత నెల 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ పని ఎప్పుడు జరిగేదీ చెప్పలేదు. ఓ అంచనా ప్రకారం వచ్చే ఏడాది జనగణన జరగవచ్చు. అంటే 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ ఐదేండ్లు ఆలస్యంగా జరుగుతుందన్న మాట. 1881లో వలస పాలకులు దేశంలో తొలిసారిగా జనగణన నిర్వహించారు. అప్పట్నించి ప్రతి పదేండ్లకూ జనాభా లెక్కల సేకరణ జరుగుతోంది. 2021లో కోవిడ్‌ మహమ్మారి సాకుతో వాయిదా పడింది. కాగా ప్రభుత్వం ఇంకా జనగణన షెడ్యూలును ప్రకటించలేదు. కోవిడ్‌ తర్వాత జనగణన జరపని కొన్ని దేశాల సరసన ఇప్పుడు భారత్‌ కూడా చేరిపోయింది.
పీడీఎస్‌ ద్వారా 80 కోట్ల మందికి రేషన్‌
ఇండియాస్పెండ్‌ అనే సంస్థ నివేదిక ప్రకారం దేశంలో పది కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థకు దూరంగా ఉన్నారు. జనాభాకు సంబంధించిన జాతీయ కమిషన్‌ అంచనాల ప్రకారం 2025 నాటికి 92 కోట్ల మందిని ఈ వ్యవస్థ కిందికి తీసుకురావాల్సి ఉంటుంది. 2011 జనగణన ప్రకారం 80 కోట్ల మందికి సబ్సిడీపై రేషన్‌ లభిస్తోంది. దీనిని బట్టి చూస్తే జనగణనలో జరుగుతున్న జాప్యం కారణంగా 12 కోట్ల మంది సబ్సిడీ రేషన్‌కు దూరంగా ఉన్నారని అర్థమవుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కోట్లాది మందికి ఆహార ధాన్యాలు లభిస్తున్నప్పటికీ ఇంకా చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం 80.6 కోట్ల మంది ప్రజలు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వచ్చారు. వీరి కోసం 2023-24లో రాష్ట్రాలకు కేంద్రం రూ.8,700 కోట్లకు పైగా విడుదల చేసింది. వచ్చే ఏడాది జరగబోయే జనగణన లెక్కల ఆధారంగా ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి వచ్చే అర్హత కలిగిన కుటుంబాలను నిర్ణయించాలని ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ అంటోంది.
ప్రపంచబ్యాంక్‌ విశ్లేషణ ఆధారంగా గొప్పలు
ఏప్రిల్‌లో ప్రపంచబ్యాంక్‌ జరిపిన విశ్లేషణ ప్రకారం 2011-12, 2022-23 మధ్యకాలంలో 17.1 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారట!. ఆ విశ్లేషణ వెలువడిన తర్వాత ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొని పత్రికా ప్రకటనలు విడుదల చేసింది. గత దశాబ్ద కాలంలో పేదరికాన్ని తగ్గించడంలో భారత్‌ గణనీయమైన పురోగతి సాధించిందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని, మహిళల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ఊదరగొట్టింది. కాగా జనగణనతో పాటే ఆరు కీలమైన ప్రభుత్వ డేటాల విడుదల ఆలస్యమవుతోంది. తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు తమ వార్షిక నివేదికలను విడుదల చేయలేదు. వాటిలో కొన్ని నివేదికలు ఏండ్ల తరబడి వెలుగు చూడడం లేదు. జనగణనకు, సర్వే-స్టాటిస్టిక్స్‌/రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు ఈ ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు యాభై శాతానికి పైగా తగ్గించడాన్ని చూస్తుంటే 2025లో జనగణన మొదలయ్యే అవకాశాలు ఎంతమాత్రం కన్పించడం లేదు.
ప్రాధాన్య కుటుంబాలకు నష్టమే
ప్రభుత్వం ప్రస్తుత జనాభా అంచనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కాలదోషం పట్టిన 2011 లెక్కలనే పట్టుకొని వేలాడుతోంది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను మరో ఐదేండ్లు పొడిగించాలని గత ఏడాది జనవరిలో ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక నిరుపేదలకు అంత్యోదయ అన్నయోజన కింద సబ్సిడీకి బదులు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం ప్రాధాన్యత కుటుంబాలకు అందుబాటులో ఉన్న ఆహార ధాన్యాల పరిమాణాన్ని సగానికి సగం తగ్గిస్తుందని ఇండియాస్పీడ్‌ చెబుతోంది. 2025 ఏడాదికిగానూ ప్రభుత్వం రూ.2.03 లక్షల కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌ కంటే ఇది ఒక శాతం తక్కువ. కానీ సవరించిన అంచనాల కంటే మూడు శాతం ఎక్కువ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -