నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం 12మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై రూ. 46లక్షల రివార్డు ఉన్నట్లు సీనియర్ అధికారులు తెలిపారు. సౌత్ సబ్ జోనల్ బ్యూరోకి చెందిన ఎనిమిది మంది మహిళలు సహా 12మంది కేడర్ సభ్యులు ఇక్కడి సీనియర్ పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారని బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.
వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు మరియు కటేకళ్యాణ్ ఏరియా కమిటీ ఇన్‌చార్జ్ సోమదు మడ్కం (42), వివిధ యూనిట్లకు చెందిన పార్టీ సభ్యులు హుంగి కుంజమ్(19), పయకి కుంజమ్(22)లు ఒక్కొక్కరిపై రూ.8లక్షల రివార్డు ప్రకటించారని అన్నారు. మరోముగ్గురు కేడర్లకు ఒక్కొక్కరికీ రూ.5లక్షలు, ఒక కేడర్‌కు రూ.2 లక్షలు, ఐదుగురు కేడర్లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించారని చెప్పారు. ఎకె-47 రైఫిల్, రెండు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, 250 జిలెటిన్ స్టిక్స్, 400డిటోనేటర్స్, గన్ పౌడర్ నింపిన ఒక ప్లాస్టిక్ డ్రమ్, కార్డెక్స్ వైర్ బండిల్‌ను అప్పగించారని ఆ అధికారి తెలిపారు.



