నవతెలంగాణ-హైదరాబాద్ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి నెత్తురు పారింది. వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో మొత్తం 14 మంది పాకిస్థానీ సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు బలూచిస్థాన్‌లో తీవ్రమవుతున్న తిరుగుబాటును, నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి.
బోలాన్ జిల్లాలోని మాచ్ ప్రాంతంలోని షోర్కాండ్ వద్ద సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని బీఎల్‌ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (ఎస్‌టీవోఎస్) రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీతో దాడికి పాల్పడింది. ఈ శక్తివంతమైన పేలుడు ధాటికి వాహనంలోని స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూఖ్‌తో సహా మొత్తం 12 మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
అదే రోజు కేచ్ జిల్లాలోని కులగ్ టిగ్రాన్ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యానికి చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌పై బీఎల్‌ఏ ఫైటర్లు మరో దాడి చేశారు. మధ్యాహ్నం సుమారు 2:40 గంటలకు క్లియరెన్స్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందారు.
ఈ రెండు దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు బీఎల్‌ఏ ప్రతినిధి జీయంద్ బలూచ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాకిస్థాన్ సైన్యం ఒక కిరాయి సైన్యమని తమ భూమిని ఆక్రమించుకున్న ఈ కిరాయి సైన్యంపై బలూచ్ స్వాతంత్ర్య సమరయోధుల దాడులు మరింత తీవ్రతతో కొనసాగుతాయని హెచ్చరించారు.
బలూచిస్థాన్‌లో బీఎల్‌ఏ దాడులు.. 14 మంది పాక్ సైనికుల మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES