నవతెలంగాణ న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీజేఐ హోదాలో జస్టిస్ సూర్యకాంత్ తొలి రోజు 17 కేసులు విచారించారు. అదే విధంగా ఓ కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకొచ్చారు. ఇకపై అర్జెంట్ లిస్టింగ్ కేసులను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరణశిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం వంటి అసాధారణ పరిస్థితుల్లోనే మౌఖిక అభ్యర్థనలను అనుమతించనున్నట్టు ఆయన తెలిపారు.
రాష్ట్రపతి భవన్‌లో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జస్టిస్ సూర్యకాంత్ సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. న్యాయస్థానం ప్రాంగణంలోని గాంధీ, బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం ఒకటో నంబర్ కోర్టు రూమ్‌లో జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ అతుల్ ఎస్.చందూర్కర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనానికి నేతృత్వం వహించారు. ఓ ప్రయివేటు సంస్థకు వ్యతిరేకంగా హిమాచల్ ప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును వెలువరించారు. ఆయన నేతృత్వంలోని ధర్మాసనం రెండు గంటల్లో దాదాపు 17 కేసులను విచారించింది.



