Wednesday, November 26, 2025
E-PAPER
Homeజాతీయంబంగాళాఖాతంలో 2 వాయుగుండాలు..!

బంగాళాఖాతంలో 2 వాయుగుండాలు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. మలక్కా జలసంధి సమీపంలోని తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి, రాబోయే 24 గంటల్లో పశ్చిమ దిశగా, తర్వాత 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇది తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రెండు రోజుల్లో దీని గమనం, తీవ్రతపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

ఇది శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఏపీ తీరాల వైపు వెళ్తుందని కొన్ని మోడళ్లు, సముద్రంలోనే బలహీనపడుతుందని మరికొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక, భూమధ్యరేఖకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర- వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని అంచనా. ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని, దీని ప్రభావం ఏపీ, తమిళనాడులపై ఉంటుందని పలు వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.

ఈ వాయుగుండాల ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో శనివారం తర్వాత వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీసత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సముద్రంలో అధిక వేగంతో గాలులు వీచి, అలజడిగా మారనున్న నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -