నవతెలంగాణ-హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌తో మావోయిష్టులకు తీవ్ర ఎదురు దెబ్బ తగులుతోంది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు కట్టుదిట్టం చేశాయి. అడవుల్లో అదనపు బలగాలతో జల్లెడ పడుతున్నాయి. నిరంతర దాడులతో మావోయిష్టులు ఉక్కిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కాల్పుల్లో అనేక మంది అగ్రనాయకులు చనిపోయారు. పలువురు ఆయుధాలతో సహా లొంగిపోయారు. పలు రోజుల నుంచి నుంచి లొంగుపాటు పర్వం కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 208మంది మావోయిస్టులు 153 ఆయుధాలతో పాటు లొంగిపోయినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. వారిలో అగ్ర కేడర్ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నాయి.

208 మంది మావోయిస్టులు శుక్రవారం జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చి జగదల్‌పూర్‌లోని పోలీస్ లైన్స్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మరియు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఎదుట తమ ఆయుధాలను అప్పగించారు. ఆయుధాల్లో 19ఎకె-47రైఫిల్స్, 17ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్, 23ఐఎన్‌ఎస్‌ఎఎస్ రైఫిల్స్, ఒక ఐఎన్‌ఎస్‌ఎఎస్ ఎల్‌ఎంజి, 36.303 రైఫిల్స్, 4 కార్బైన్లు, 11 బిజిఎల్ లాంచర్లు, 41 12బోర్/సింగిల్ షాట్, ఒక పిస్టల్ ఉన్నట్లు వెల్లడించాయి.
208మందిలో 110మంది మహిళలు, 99మంది పురుషులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో కేంద్ర కమిటీ సభ్యులు ఒకరు, నలుగురు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ కమిటీ సభ్యుడు ఒకరు, 21మంది డివిసిఎం స్థాయి, 61మంది ఎసిఎం స్థాయి, 98మంది కేడర్ సభ్యులు, 22మంది పిఎల్‌జిఎ/ఆర్‌పిసి/ఇతరులు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అగ్రనేత ఆశన్న సహా 170మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్రహోంమంత్రి అమిత్‌షా ఎక్స్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో 27 మంది, మహారాష్ట్రలో 60మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు.