రూ.63వేల కోట్ల ఒప్పందంపై భారత్..ఫ్రాన్స్ సంతకాలు
న్యూఢిల్లీ : భారత నావికాదళం కోసం 26 రాఫెల్-ఎం యుద్ధ విమానాలను అందించేందుకు రూ. 63వేల కోట్ల ఒప్పందంపై సోమవారం భారత్-ఫ్రాన్స్‌లు సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 21 సింగిల్ సీటర్ జెట్‌లు, రెండు సీట్లతో కూడిన నాలుగు జెట్ ఫైటర్లను 2031 నాటికి అందించే అవకాశం వుందని భావిస్తున్నారు. విమానాల నిర్వహణ, అవసరమైన మౌలిక వసతుల సదుపాయాలు, సిబ్బంది శిక్షణ వంటివి కూడా ఈ ఒప్పందంలో భాగంగా వున్నాయి. నౌనేన్ భవన్‌లో జరిగిన ఈ ఒప్పంద సంతకాల కార్యక్రమంలో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, నావికా దళ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ,. భారత్‌లోని ఫ్రెంచ్ రాయబారి థోరీ మాథౌ హాజరయ్యారు. ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి భారత్‌కు రావాల్సి వుంది. కానీ వ్యక్తిగత కారణాల రీత్యా ఆ పర్యటన వాయిదా పడింది. దీంతో ఇరుదేశాల రక్షణమంత్రులు వర్చువల్‌గా సమావేశానికి హాజరైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది పూర్తిగా భారత్-ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందమని వివరించాయి. దీనితో పాటు ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రభుత్వాలు, వాణిజ్య వర్గాల మధ్య అనుబంధ ఒప్పందాలు కూడా జరిగాయి. నావికాళంలోకి వచ్చే ఈ రెండు కొత్త ఆయుధాలు విమాన వాహక నౌకలైన ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యల్లో మొహరిస్తారు. దీంతో హిందూ మహా సముద్రంలో భారత నావికాదళం శక్తి సామర్ధ్యాలు మరింత బలోపేతమవుతాయి. కాలం చెల్లిన మిగ్-29 దళం స్థానంలో ఇవి చేరతాయి. ప్రస్తుతం భారత నావికాదళంలో మాత్రమే ఈ యుద్ధ విమానం వుంది. కాగా, ప్రస్తుతం భారత వాయుసేన మొత్తంగా 36 రాఫెల్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. తాజాగా నావికా దళం కూడా వీటిని కొనుగోలు చేస్తుండడం వల్ల రెండు దళాల మధ్య సమన్వయం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే బడ్డీ-బడ్డీ రీ ఫ్యూయలింగ్‌కు అవకాశం ఉంటుందని అంటున్నారు. ఓ ఫైటర్ జెట్ రీ ఫ్యూయలింగ్ పాడ్ సాయంతో మరో ఫైటర్ జెట్‌లో ఇంధనం నింపడాన్ని ఇలా అంటారు. అప్పుడు భారీ ఇంధన ట్యాంకర్ విమానాల అవసరం వుండదని కేంద్రం పేర్కొంటోంది.
నేవీలోకి 26 రాఫెల్ విమానాలు
- Advertisement -
- Advertisement -