నవతెలంగాణ-హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మొత్తం 27మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. వారిపై మొత్తం రూ.50లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులందరూ క్రియాశీల సభ్యులేనని, వారిలో 17 మంది పురుషులు, పది మంది మహిళలు ఉన్నారని పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
ఓయం లఖ్ము(53)పై అత్యధికంగా రూ.10 లక్షల రివార్డు ప్రభుత్వం ప్రక టించిందని, అతను హెడ్‌క్వార్టర్ ప్లాటూన్ నెంబర్ 2 సరఫరా బృంద కమాండర్ పదవిలో ఉన్నాడని సుక్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ పేర్కొన్నారు. మిగిలిన వారిలో ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు, ఒకరికి రూ.3లక్షల రివార్డు ఉందని అన్నారు. మరో ఇద్దరు మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, తొమ్మిది మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.50 లక్షలు రివార్డు ప్రకటించినట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించిన ‘చత్తీస్‌గఢ్ నక్సలైట్ సరెండర్ రిహాబిలిటేషన్ పాలసీ’ పథకంతో ప్రభావితమై వారంతా పోలీసుల ఎదుట లొంగిపోయారని అన్నారు. అక్టోబర్ 10న నారాయణ్‌పూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోగా, వారిపై మొత్తంగా రూ.48 లక్షల రివార్డు ప్రకటించారు. అక్టోబర్ 2న వందమందికి పైగా మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే.