– యువతను చుట్టుముడుతున్న వ్యాధులు
– ఎన్సీడీ స్క్రీనింగ్‌తో గుర్తింపు
– మారుతున్న జీవనశైలే కారణమంటున్న వైద్యులు
– ఒత్తిడి, తీరికలేని శ్రమతో మానసిక స్థితిపై ప్రభావం
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘మల్కాజిగిరికి చెందిన నరేశ్‌కు సుమారు 30 ఏండ్లు ఉంటాయి. కొద్ది రోజులుగా అధిక దాహం, మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన ఎన్సీడీ సర్వేలో వైద్య సిబ్బంది అతడికి పరీక్షలు చేశారు. అతనికి షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వైద్య సిబ్బంది అతడికి మందులు అందించి షుగర్ అదుపులో ఉండేందుకు సూచనలు చేశారు.. ఇది ఒక్క నరేశ్ సమస్యే కాదు. వేలాది మంది యువత తక్కువ వయస్సులోనే ఇలాంటి సమస్యతో బాధ పడుతున్నారు.
మారుతున్న జీవనశైలితో అనేక మంది వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. సరైన పోషకాలున్న ఆహార పదార్ధాలను తీసుకోకపోవడం.. ఒత్తిడి, నిద్రలేమి తదితర కారణాలతో అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇందులో భాగంగా యువత బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు. వృద్ధాప్యంలో రావాల్సిన ఇలాంటి వ్యాధులు 30 ఏండ్లు దాటకున్నా బయటపడటం కలవర పెడుతోంది. వేలాది మంది ఇలా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఎన్‌సీడీ పరీక్షల్లో నిర్ధారణ వుతోంది. ఇప్పటి వరకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చేపట్టిన స్క్రీనింగ్‌లో 1,39,487 మందికి షుగర్, 2,05,998 మందికి బీపీ ఉన్నట్టు గుర్తిం చారు. దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు జిల్లాలోని ఎన్‌సీడీ కార్నార్, క్లీనిక్‌ల ద్వారా అందిస్తున్న సేవలు విస్తృతం కావడం, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తుండటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది. అదే స్థాయిలో చికిత్స కూడా అందుతోంది.
వంశపారపర్యంగానూ..
డయాబెటీస్ ఎక్కువగా వంశపారంపర్యంగా.. వయస్సు పెరిగే కొద్ది వస్తుంది. ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా పాంక్రియాటిక్ గ్రంథిలో ఇన్సూలిన్ ఉత్పత్తి తగ్గి వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిళ్లు తినడం, ఎలాంటి వ్యాయామమూ చేయకపోవడంతో ఊబకాయం పెరిగి అధిక డయాబెటీస్‌కు దారి తీస్తుంది. చిన్న వయస్సులో ఎత్తు కంటే అధికంగా బరువు పెరగడం వల్ల రాత్రి నిద్రించే సమయంలో కొన నాలుక అడ్డుపడి నిద్రపట్టక మానసిక ఒత్తిడికి గురవుతారు.
నిర్లక్ష్యంతో పెరుగుతున్న నష్టం..
చాలా మంది బీపీ, షుగర్‌ను గుర్తించడం లేదు. నిర్లక్ష్యంతోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల పిల్లల్లోనూ ఎక్కువగా డయాబెటీస్ లక్షణాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యు లోపంతో పుట్టిన సమయంలోనే ఎక్కువగా పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది. కానీ పదేండ్లలోపు పిల్లలు కూడా వ్యాధి బారిన పడుతున్నారు. త్వరగా అలిసిపోవడం, తిన్న వెంటనే ఆకలి అనిపించడంతో పిల్లలు చదువు, ఆటలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. గడిచిన ఐదేండ్లలో బీపీ, షుగర్ బారిన పడిన వారిలో ఎక్కువగా యువతే ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జనాభాలో 30 ఏండ్ల వారిలో 52 శాతం స్క్రీనింగ్ చేయగా.. 13 శాతం షుగర్, 26 శాతం రక్తపోటు ఉన్నట్టు గుర్తించారు. రూరల్ ప్రాంతంతో పోలిస్తే అర్బన్ ప్రాంతంలోని వారే ఎక్కువగా మధుమేహం, రక్తపోటు బారిన పడుతున్నట్టు గుర్తించారు.
నియంత్రణే మార్గం
రక్తపోటు, మధుమేహం నియంత్రణ తప్ప నివారణకు అవకాశం లేదు. ఇలాంటి వ్యాధుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ కార్యక్రమాన్ని 2019 సెప్టెంబర్‌లో ప్రారంభించింది. 30 ఏండ్లు దాటి రక్తపోటు, మధుమేహానికి గురయ్యే వారిని గుర్తించి ముందస్తుగా వారికి వైద్య సేవలు అందించడం.. తద్వారా వారి ఆయుష్షును పొడిగించడం ఈ పథకం లక్ష్యం. జిల్లాలో పలు విడతలుగా సర్వే నిర్వహించి బీపీ, షుగర్ బాధితులను గుర్తిం చగా సంబంధిత సెంటర్ల ద్వారా మందులు తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు.
జీవనశైలిలో మార్పులు తప్పనిసరి
చిన్న వయస్సులోనే బీపీ, షుగర్ బయట పడుతున్నాయి. జీవన శైలిలో మార్పులతో వీటిని అదుపులో పెట్టొచ్చు. సకాలంలో తినడం, ఒత్తిడికి గురికాకుండా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం, వర్క్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల బీపీ, షుగర్ వ్యాధులను కంట్రోల్‌లోకి తీసుకురావొచ్చు. పని ఒత్తిడి, వంశపారంపర్యంగా కూడా ఇలాంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న పిల్లల్లో కూడా బీపీ, షుగర్ వ్యాధులు ఉంటున్నాయి. కానీ చాలా తక్కువ సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి.
– డాక్టర్ సి.ఉమాగౌరీ, డీఎంఅండ్‌హెచ్‌ఓ, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
30 ఏండ్లకే బీపీ, షుగర్..!
- Advertisement -
RELATED ARTICLES