నవతెలంగాణ గాజా: గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న అమానవీయ దాడులకు ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. తాజాగా ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో 30 మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… బుధవారం ఉదయం గాజా నగరానికి తూర్పున ఉన్న జీ టౌన్‌లో అల్ ఫలా స్కూల్‌పై క్షిపణి దాడికి పాల్పడింది. ఈ స్కూల్లోనే వందలాది మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్షిపణి దాడిలో 34 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
అలాగే గాజా నగరానికి తూర్పున ఉన్న దరాజ్ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం బాంబు దాడికి పాల్పడంతో ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, అక్టోబర్ 7 2023న ప్రారంభమైన ఇజ్రాయిల్ దాడుల వల్ల ఇప్పటివరకూ ఎన్నో భవనాలు, పాఠశాలలు బాంబుల దాడికి కూలిపోయాయి.