నవతెలంగాణ – హైదరాబాద్: నేటి యువ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు… “తర్వాత ఏం నేర్చుకోవాలి?” అని నిర్ణయించుకోవడమే. లింక్డ్‌ఇన్ తాజా డేటా ప్రకారం, వేగంగా మారుతున్న సాంకేతికతకు మరియు నేటి ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలకు తాము సిద్ధంగా లేమని 38% మంది భారతీయ ఉద్యోగార్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఉద్యోగార్థులకు సహాయపడటానికి మరియు వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి… లింక్డ్‌ఇన్ తన ‘స్కిల్స్ ఆన్ ది రైజ్ 2026’ నివేదికను విడుదల చేసింది. సంస్థలు మరియు పరిశ్రమల అంతటా వేగంగా వృద్ధి చెందుతున్న ఐదు నైపుణ్యాల సమూహాలను ఇది హైలైట్ చేసింది. అవి: ఏఐ & ఆటోమేషన్, డేటా & అనలిటిక్స్, ఐటీ & సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ & గ్రోత్ మరియు పీపుల్ & లీడర్‌షిప్.
లింక్డ్‌ఇన్ డేటా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిక్రూటర్లలో 46% మంది ఇప్పుడు సరైన అభ్యర్థులను ఎంచుకోవడానికి నైపుణ్యాల డేటా పైనే ఆధారపడుతున్నారు. అయినప్పటికీ, అర్హత కలిగిన నైపుణ్యం గల వారిని కనుగొనడం మునుపటి కంటే ఇప్పుడు మరింత కష్టంగా మారిందని భారతదేశంలోని 74% రిక్రూటర్లు చెబుతున్నారు. ఏఐ (AI) సాధనాలతో పనిచేయగల, డేటాను విశ్లేషించి అన్వయించగల, డిజిటల్ సిస్టమ్‌లను అర్థం చేసుకుని కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచగల నిపుణులకు అన్ని పరిశ్రమలలో డిమాండ్ పెరుగుతోంది.
అయితే, కేవలం సాంకేతిక సామర్థ్యం ఒక్కటే సరిపోదు. జట్లు మరింత ‘క్రాస్-ఫంక్షనల్’గా మరియు ‘ఏఐ-ఎనేబుల్డ్’గా మారుతున్న కొద్దీ… సాంకేతిక పరిజ్ఞానాన్ని కొలవగల ప్రభావంగా మార్చడానికి… సహకారం, వాటాదారుల నిర్వహణ మరియు ప్రాజెక్ట్ నాయకత్వం వంటి వ్యక్తిగత నైపుణ్యాలు కూడా అత్యంత అవసరం.
లింక్డ్‌ఇన్ కెరీర్ ఎక్స్‌పర్ట్ మరియు ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ నిరాజితా బెనర్జీ మాట్లాడుతూ, “కొన్నేళ్లుగా యువ నిపుణులకు ఏదైనా ఒక రంగంలో ప్రత్యేకత సాధించమని చెబుతూ వచ్చారు. కానీ 2026లో ఆ నియమం మారుతోంది. నేడు సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్న అభ్యర్థులు కేవలం ఒకే రంగంలో నిపుణులు కాదు… వారు విభిన్న నైపుణ్యాలను కలబోసిన వారు. ఏఐ (AI)తో ఎలా పనిచేయాలో, డేటాను ఎలా విశ్లేషించాలో, పనితీరును ఎలా మెరుగుపరచాలో వారికి తెలుసు. వీటన్నింటికీ మించి, వివిధ బృందాలతో కలిసి ఎలా పనిచేయాలో కూడా వారికి తెలుసు. ఈ నైపుణ్యాల కలయిక వారి ‘అనుకూలతను’ సూచిస్తుంది. వేగంగా మారుతున్న ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో ఈ అనుకూలతే మీకు ఉద్యోగంతో పాటు ప్రమోషన్‌ను కూడా తెచ్చిపెడుతుంది. ఈ మార్కెట్‌లో మీ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకుంటే, విడివిడిగా ఉండే నైపుణ్యాల వెంట పడటం మానేసి… మీకంటూ ప్రత్యేకమైన ‘స్కిల్స్ స్టాక్’ను నిర్మించుకోండి. దానినే మీ ప్రధాన పోటీతత్వంగా మార్చుకోండి,” అని అన్నారు.
భారతదేశంలోని ఉద్యోగార్థులు తమ కెరీర్‌ను మార్చుకోవడానికి నేర్చుకోవాల్సిన ఐదు నైపుణ్యాల సమూహాలు ఇక్కడ ఉన్నాయి: 1. ఏఐ & ఆటోమేషన్ – ఉత్పాదకతే కొత్త ప్రాతిపదిక: ఏఐ (AI) ని తమ రోజువారీ పనుల్లో భాగం చేసుకోగల నిపుణులు.. పనులను వేగంగా, విస్తృతంగా చేయగలుగుతారు. ఇంజనీరింగ్ మరియు ఐటీ రంగాల్లో వర్క్‌ఫ్లో ఆటోమేషన్, LLMOps, AutoML మరియు ఏపీఐ ఇంటిగ్రేషన్ (API integration) వంటి నైపుణ్యాలకు మంచి గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు హెచ్‌ఆర్ (HR), మార్కెటింగ్, సేల్స్ మరియు కన్సల్టింగ్ విభాగాల్లో ‘ప్రాంప్ట్ ఇంజనీరింగ్’ నైపుణ్యం ప్రముఖంగా కనిపిస్తోంది. దీన్నిబట్టి ప్రధాన వ్యాపార విభాగాల్లోకి కూడా ఏఐ పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తోందని స్పష్టమవుతోంది.
2. డేటా & అనలిటిక్స్ – విశ్లేషణ ఆచరణలోకి మారాలి: కేవలం డేటాను విశ్లేషించడమే కాకుండా.. ఆ డేటాలోని అంతరార్థాన్ని గ్రహించి, దానిని స్పష్టంగా వివరించి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించగల నిపుణులకు యాజమాన్యాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ‘క్వెరీయింగ్’ అనేది ఒక ప్రధాన నైపుణ్యంగా ఎదుగుతోంది. ఐటీలో ‘డేటా స్టోరీటెల్లింగ్’కి డిమాండ్ పెరుగుతోంది. అంతేకాకుండా, బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, కన్సల్టింగ్, హెచ్‌ఆర్, విద్య మరియు మార్కెటింగ్ వంటి నాన్-టెక్ విభాగాల్లో కూడా ‘డేటా ఆధారిత నిర్ణయాలు’ తీసుకోవడం ఒక కీలక నైపుణ్యంగా మారుతోంది.
3. ఐటీ & సైబర్ సెక్యూరిటీ – విస్తరణకు స్థిరత్వం అవసరం: డిజిటల్ కార్యకలాపాలు విస్తరిస్తున్న తరుణంలో… టెక్నాలజీ వాతావరణాన్ని రక్షించగల, పర్యవేక్షించగల మరియు బలోపేతం చేయగల నిపుణులు స్థిరమైన వృద్ధికి కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకం కాగా… సంస్థల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు మద్దతు ఇచ్చే కన్సల్టింగ్ విభాగాల్లో ‘క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ నైపుణ్యాలకు గిరాకీ పెరుగుతోంది. సంస్థలు ఏఐ మరియు క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లను విస్తరిస్తున్నందున.. ఐటీ ఆటోమేషన్, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, రియల్ టైమ్ మానిటరింగ్ మరియు థ్రెట్ డిటెక్షన్ వంటి నైపుణ్యాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది సిస్టమ్ స్థిరత్వంపై సంస్థలకున్న శ్రద్ధను ప్రతిబింబిస్తోంది.
4. బిజినెస్ & గ్రోత్ – సామర్థ్యమే పోటీతత్వాన్ని పెంచుతుంది: పనితీరును మెరుగుపరుస్తూనే సంస్థ వృద్ధికి తోడ్పడే నిపుణులకు యాజమాన్యాలు తగిన గుర్తింపును ఇస్తున్నాయి. బిజినెస్ డెవలప్‌మెంట్ మరియు సేల్స్‌లో ‘రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్’కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే ఆదాయ సంబంధిత విభాగాల్లో ‘నెగోషియేషన్’ అనేది ప్రధాన సామర్థ్యంగా కొనసాగుతోంది. బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, ఇంజనీరింగ్, ఐటీ, కన్సల్టింగ్ మరియు ఫైనాన్స్ విభాగాల్లో ‘ప్రాసెస్ ఆప్టిమైజేషన్’ నైపుణ్యం వేగంగా ఉద్భవిస్తోంది. మార్కెటింగ్, ఆర్ట్స్ అండ్ డిజైన్, విద్య మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో ‘విజువల్ స్టోరీటెల్లింగ్’ కూడా మంచి ఆదరణ పొందుతోంది.
5. పీపుల్ & లీడర్‌షిప్ – సమిష్టి కృషితో వ్యాపార వృద్ధి: బిజినెస్ డెవలప్‌మెంట్, సేల్స్, ఇంజనీరింగ్, విద్య, ఆర్ట్స్ అండ్ డిజైన్, ఐటీ, కన్సల్టింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్స్ మరియు మార్కెటింగ్ వంటి అనేక రంగాల్లో ‘కొల్లాబరేషన్’ అనేది నిలకడగా కనిపిస్తోంది. వేర్వేరు జట్లు ఎలా పనిచేస్తున్నాయో ఇది స్పష్టం చేస్తోంది. పనులు మరింతగా ఏఐ (AI) ఆధారితంగా, క్రాస్-ఫంక్షనల్‌గా మారుతున్న కొద్దీ… వ్యక్తులను సమన్వయం చేయడం, సంక్లిష్టతలను నిర్వహించడం మరియు సమిష్టిగా ఫలితాలను రాబట్టడం అనేవి ఉద్యోగావకాశాలను నిర్ణయించే ప్రధాన నైపుణ్యాలుగా మారుతున్నాయి.
నిపుణులు అత్యధిక డిమాండ్ ఉన్న ఈ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడేలా… లింక్డ్‌ఇన్ కొన్ని ఎంపిక చేసిన ‘లింక్డ్‌ఇన్ లెర్నింగ్’ కోర్సులను మార్చి 31, 2026 వరకు ఉచితంగా అందిస్తోంది. వీటిలో ‘ఏఐ ఏజెంట్స్ ఫర్ ఎవ్రీడే ప్రొఫెషనల్స్’, ‘లెర్నింగ్ డేటా అనలిటిక్స్’, ‘స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ ఫర్ లీడర్స్ అండ్ మేనేజర్స్’ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో ఈ ఏడాది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలు (Skills on the Rise) ఇవే:
1. ఏఐ & ఆటోమేషన్ (AI & Automation)
• ప్రాంప్ట్ ఇంజనీరింగ్ (Prompt Engineering)
• వర్క్‌ఫ్లో ఆటోమేషన్ (Workflow Automation)
• లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆపరేషన్స్ (LLMOps)
• ఆటోమేటెడ్ మెషిన్ లెర్నింగ్ (AutoML)
• అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API)
2. డేటా & అనలిటిక్స్ (Data & Analytics)
• క్వెరీయింగ్ (Querying)
• డేటాబేస్ ఆప్టిమైజేషన్ (Database Optimisation)
• డేటా అనాలిసిస్ (Data Analysis)
• డేటా స్టోరీటెల్లింగ్ (Data Storytelling)
• డేటా ఎథిక్స్ (Data Ethics – డేటా నైతికత)
3. ఐటీ & సైబర్ సెక్యూరిటీ (IT & Cybersecurity)
• క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (Cloud Infrastructure)
• ఐటీ ఆటోమేషన్ (IT Automation)
• ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ (Incident Management)
• రియల్-టైమ్ మానిటరింగ్ (Real-Time Monitoring)
• థ్రెట్ డిటెక్షన్ (Threat Detection – ముప్పును గుర్తించడం)
4. బిజినెస్ & గ్రోత్ (Business & Growth)
• రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (Relationship Management)
• జీటీఎమ్ & గ్రోత్ స్ట్రాటజీ (GTM & Growth Strategy)
• ఆపరేషనల్ ఎఫిషియెన్సీ లేదా ప్రాసెస్ ఆప్టిమైజేషన్ (Operational Efficiency or Process Optimisation – కార్యాచరణ సామర్థ్యం)
• నెగోషియేషన్ (Negotiation)
• విజువల్ స్టోరీటెల్లింగ్ & కమ్యూనికేషన్ (Visual Storytelling & Communication)
5. పీపుల్ & లీడర్‌షిప్ (People & Leadership)
• కొల్లాబరేషన్ (Collaboration)
• టీమ్ మేనేజ్‌మెంట్ (Team Management)
• స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ (Stakeholder Management)
• బడ్జెట్ మేనేజ్‌మెంట్ (Budget Management)
• ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ (Project Management)
కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నిపుణులకు లింక్డ్‌ఇన్ కెరీర్ నిపుణురాలు నిరాజితా బెనర్జీ ఇస్తున్న సూచనలు ఇవే:
• మీ నైపుణ్యాలను విస్తృతంగా అంచనా వేసుకోండి: మీరు ఇప్పటివరకు పెంపొందించుకున్న నైపుణ్యాలన్నింటినీ ఒక్కసారి పరిశీలించండి. మీరు పనిచేసిన ఆఫీసుల నుండి మీరు చేసిన స్వచ్ఛంద సేవల వరకు అన్నింటినీ పరిగణనలోకి తీసుకోండి. మీరు అనుకుంటున్న దానికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న నైపుణ్యాలు మీలో ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా మానవ నైపుణ్యాలకు నేడు మంచి విలువ ఉంది. మీరు వెళ్లాలనుకుంటున్న రంగానికి/ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు మీలో లేవని గుర్తిస్తే… వెంటనే వాటిని నేర్చుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోండి.
• ఉద్యోగాల పేరు వెంట కాదు, నైపుణ్యాల వెంట వెళ్లండి: నియామక మేనేజర్లకు అవసరమైన నైపుణ్యాలు మరియు మీకు ఉన్న నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ద్వారా… మీరు ఎంపికయ్యే అవకాశాలు పెరుగుతాయి. మీరు ఎలాంటి ఉద్యోగం కోసం వెతుకుతున్నారో సరళమైన భాషలో వివరించడానికి ‘లింక్డ్‌ఇన్ ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్‘ని ఉపయోగించండి. అలాగే ప్రతి జాబ్ పోస్టింగ్‌లో ఉన్న జాబ్ మ్యాచ్ ఫీచర్‌ను ఉపయోగించి ఆ ఉద్యోగానికి మీరు ఎంతవరకు సరిపోతారో సులభంగా తెలుసుకోండి.
• కేవలం చెప్పడం కాదు, చేసి చూపించండి : మీ రెజ్యూమ్‌లో కేవలం నైపుణ్యాల పేర్లను రాయడం వరకే పరిమితం కాకండి. మీరు ఆ నైపుణ్యాలను ఎలా ఉపయోగించారు, ఎలాంటి ప్రభావాన్ని సృష్టించారు మరియు ఎలాంటి ఫలితాలను సాధించారనే విషయాలను మీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్‌లో స్పష్టంగా వివరించండి. దీనివల్ల మీ నైపుణ్యం, అనుభవం రిక్రూటర్లకు సులభంగా అర్థమవుతాయి.
• పూర్తి ప్రొఫైల్‌తో అవకాశాలను ఆకర్షించండి: రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడానికి… మీకు సంబంధించిన కనీసం ఐదు ముఖ్యమైన నైపుణ్యాలతో మీ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి. ఆకర్షణీయమైన హెడ్‌లైన్, అబౌట్ మరియు ఎక్స్‌పీరియన్స్ విభాగాలను రాయడానికి లింక్డ్‌ఇన్ ఏఐ-పవర్డ్ రైటింగ్ సజెషన్స్‌ని ఉపయోగించుకోండి. మీ ప్రొఫైల్‌కు ఫోటోను జోడించడం మరియు మీ వివరాలను ధృవీకరించుకోవడం ద్వారా నమ్మకం కలుగుతుంది. తద్వారా రిక్రూటర్లు మిమ్మల్ని సులభంగా కనుగొనగలుగుతారు.



