నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లో దగ్గు మందుల మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల నకిలీ సిరప్‌లతో 24 మంది చిన్నారులు మరణించిన ఘటన మరవకముందే, ఇప్పుడు ఓ ఆయుర్వేద దగ్గు మందు 5 నెలల శిశువు ప్రాణాలను బలిగొంది. చింధ్వాడా జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అధికారులు వెంటనే స్పందించి, మందు అమ్మిన దుకాణాన్ని మూసివేశారు.
చింధ్వాడా జిల్లా బిచ్వా గ్రామానికి చెందిన సందీప్ మినోట్ కుమార్తె 5 నెలల రూహీకి దగ్గు, జలుబు చేసింది. దీంతో వారు అక్టోబర్ 27న స్థానికంగా ఉన్న ఆక్సిజన్ మెడికల్ స్టోర్‌లో ఓ ఆయుర్వేద దగ్గు సిరప్‌ను కొనుగోలు చేశారు. దుకాణదారుడి సలహా మేరకు పాపకు ఆ మందు పట్టించారు. అయితే, కొద్ది గంటల్లోనే చిన్నారి ఆరోగ్యం విషమించింది. “పాపకు శ్వాస ఆడలేదు, వెంటనే ఊపిరి ఆగిపోయింది” అని తండ్రి సందీప్ కన్నీటిపర్యంతమయ్యారు.
వెంటనే పాపను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, తెల్లవారుజామున 4:30 గంటలకు శిశువు అప్పటికే మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. సిరప్ అమ్మిన మెడికల్ స్టోర్‌ను సీల్ చేసి, మిగిలిన స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిరప్ నమూనాలను పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ల్యాబొరేటరీకి పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిచ్వా పోలీసులు కేసు నమోదు చేశారు. “జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుంది” అని జిల్లా కలెక్టర్ హరేంద్ర నారాయణ్ తెలిపారు.
ఏడాది లోపు పిల్లలకు వైద్యుని సిఫార్సు లేకుండా దగ్గు మందులు అమ్మకూడదన్న నిబంధనలను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద ఈ కేసును విచారిస్తున్నారు.

 
                                    