Tuesday, April 29, 2025
Homeజాతీయంపట్టాలు తప్పుతోన్న రైల్వేలు

పట్టాలు తప్పుతోన్న రైల్వేలు

– గాలిలో దీపంలా ప్రయాణికుల భద్రత
– నామమాత్రంగా మౌలిక సదుపాయాల ఆధునీకరణ
– సౌకర్యాల కల్పన కంటే
– లాభార్జనకే పాలకుల ప్రాధాన్యం
– నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం
దేశ రవాణా వ్యవస్థకు భారతీయ రైల్వేలు వెన్నెముక అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణికులను, పెద్ద ఎత్తున సరుకులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అసమాన పాత్ర పోషిస్తూ ప్రజలకు తక్కువ ఖర్చుతో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అదే సమయంలో వాణిజ్యానికి కీలకమైన సరుకునూ రవాణా చేస్తోంది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా రైల్వేల ప్రాధాన్యతలలో చోటుచేసుకుంటున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సింది పోయి అనవసరమైన, అధిక వ్యయంతో కూడిన ప్రాజెక్టుల వైపు దృష్టి సారిస్తోంది.
న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలో వచ్చిన ఈ మార్పు భద్రతా పరమైన ఆందోళనలకు, నిర్వ హణా లోపాలకు దారితీస్తోంది. పెరుగుతున్న రైలు ప్రమాదాలు వ్యవస్థలోని వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. నిర్వహణలో నిర్లక్ష్యం, కాలం చెల్లిన మౌలిక వసతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవ డంలో ఉదాశీనత.. ఇవన్నీ రైల్వేల పాలిట శాపంగా మారాయి.
ఇవన్నీ వైఫల్యాలే
2023 జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు పరస్పరం ఢకొీని 293 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. 1,100 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. సిగలింగ్‌ వైఫల్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే భద్రతా కమిషన్‌ (సీఆర్‌ఎస్‌) తన విచారణ నివేదికలో తెలిపింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో బీహార్‌లోని రఘునాథ్‌పూర్‌లో నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో నలుగురు చనిపోయారు. 70 మంది గాయపడ్డారు. ట్రాక్స్‌లో జరిగిన తప్పిదం కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అదే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢకొీని 14 మంది మరణించారు. 50 మంది గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదానికి సిగల్‌ వైఫల్యం, మానవ తప్పిదం కారణమని తేలింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఓ సరుకు రవాణా రైలు జమ్మూ కాశ్మీర్‌ నుంచి పంజాబ్‌ వరకూ 70 కిలోమీటర్ల దూరం డ్రైవర్‌ లేకుండానే నడిచింది !. నిర్వహణా లోపాలకు ఈ ఘటన అద్దం పడుతోంది. అదే ఏడాది ఏప్రిల్‌లో ముంబయి లోకల్‌ రైలు పట్టాలు తప్పి హార్బర్‌ లైన్‌ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇది మౌలిక వసతుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది.
నిధుల కొరత
రైల్వేలను దీర్ఘకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య కీలక మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలకు అరకొర నిధులు కేటాయించడం. రైల్వేలో భద్రతకు సంబంధించిన పనులకు డిప్రీసియేషన్‌ రిజర్వ్‌ ఫండ్‌ (డీఆర్‌ఎఫ్‌), రైల్వే సేఫ్టీ ఫండ్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌), రాష్ట్రీల రైల్‌ సురక్షా కోశ్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) ద్వారా నిధులు సమకూరుస్తారు. ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఆస్తుల భర్తీకి ఉద్దేశించింది. దీనికి కేటాయింపులు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా కాలం చెల్లుతున్న మౌలిక వసతులను ఆధునీకరించడం సాధ్యం కావడం లేదు. 2025-26లో దీనికి కేటాయించింది రూ.2,000 కోట్లు మాత్రమే.
లాభాల పైనే దృష్టి
భారతీయ రైల్వేలో తక్షణం సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జనరల్‌, స్లీపర్‌ బోగీల సంఖ్యను ప్రభుత్వం కుదించడంతో రైళ్లలో రద్దీ పెరుగుతోంది. కోవిడ్‌ తర్వాత జన్‌ సాధారణ్‌ రైళ్లను నిలిపివేశారు. గతంలో ఒక్కో రైలులో నాలుగు జనరల్‌ బోగీలు ఉండేవి. ఇప్పుడు వాటిని రెండుకు కుదించారు. 2005లో దేశంలోని రైళ్లలో 77 శాతం స్లీపర్‌ బోగీలు ఉంటే 2022లో 54 శాతం మాత్రమే ఉన్నాయి. అదే కాలంలో ఏసీ బోగీల సంఖ్య 23 శాతం నుండి 46 శాతానికి పెరిగాయి. దీనిని బట్టి ప్రయాణికుల సౌకర్యం కంటే లాభార్జనే ప్రధానమని స్పష్టమవుతోంది. అదే విధంగా గత ఐదేండ్లలో వివిధ కారణాలతో లక్షకుపైగా రైళ్లను రద్దు చేశారు. ఇది లక్షలాది మంది ప్రయాణికుల ప్రయాణ షెడ్యూలును తారుమారు చేయడమే కాకుండా రైళ్ల నిర్వహణ, యాజమాన్యం విషయాలలో వ్యవస్థలోని లోపాలను బయటపెడుతోంది.
ఏం చేయాలి?
ఇప్పుడు భారతీయ రైల్వేల ముందున్న తక్షణ కర్తవ్యం…అధిక వ్యయంతో కూడిన భారీ ప్రాజెక్టుల నుండి కీలకమైన భద్రత, మౌలిక సదుపాయాల ఆధునీకరణ వైపు దృష్టి సారించడం. ఆర్‌ఆర్‌ఎస్‌కే, డీఆర్‌ఎఫ్‌ ద్వారా భద్రతకు నిధులు పెంచాల్సిన అవసరం ఉంది. అవి దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యతా ఉంది. ఓ దశాబ్ద కాలంలో దేశమంతటికీ అందుబాటులోకి వచ్చేలా కవచ్‌ వ్యవస్థ అమలును వేగవంతం చేయాలి. ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేసి మానవ తప్పిదాలు నివారించాలి. బులెట్‌ రైలు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు బదులు ట్రాక్‌ల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైళ్లలో రద్దీని నివారించేందుకు జనరల్‌, స్లీపర్‌ బోగీల సంఖ్యను పెంచాల్సి ఉంది. అన్నింటి కంటే ముఖ్యంగా భారతీయ రైల్వేలు భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. మౌలిక సదుపాయాలను ఆధునీకరించే వ్యూహాలను రూపొందించుకోవాలి.
హామీలే తప్ప అమలు లేదు
మౌలిక సదుపాయాల విస్తరణ, ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తామని ప్రభుత్వం హామీలు గుప్పిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ట్రాక్‌ల విస్తరణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. 1950 నుండి విస్తరణ పనులు కేవలం 23 శాతం మాత్రమే పెరిగాయి. అదే సమయంలో ప్రయాణికుల ట్రాఫిక్‌ 1,344 శాతం పెరిగింది. పైగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌, బులెట్‌ రైలు వంటి అమిత వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు ప్రాధాన్యత పెరుగుతోంది. మరోవైపు ట్రాక్‌ల నిర్వహణ, భద్రత వంటి కీలక రంగాలను పాలకులు గాలికి వదిలేశారు.
రాజీ పడుతున్న పాలకులు
ఆందోళన కలిగిస్తున్న మరో విషయమేమంటే కవచ్‌ సేఫ్టీ సిస్టమ్‌లో జరుగుతున్న జాప్యం. ఇది రైలుకు రక్షణ కల్పించే ఆటోమేటిక్‌ వ్యవస్థ. మొత్తం 68 వేల రూట్‌ కిలోమీటర్లలో (ఆర్‌కేఎం) కేవలం 3,677 ఆర్‌కేఎంలలో మాత్రమే ఈ వ్యవస్థ పనిచేస్తోంది. ఈ ప్రకారం చూస్తే ఈ వ్యవస్థ పూర్తిగా అమలులోకి రావాలంటే మరో యాభై సంవత్సరాలకు పైనే పట్టవచ్చు. దీన్నిబట్టి రైల్వే భద్రత విషయంలో పాలకులు రాజీ పడుతున్నట్టు కన్పిస్తోంది. దీనికితోడు మానవ తప్పిదాలు, సిబ్బంది కొరత పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. 2023 జూన్‌ నాటికి భారతీయ రైల్వేలో 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1.7 లక్షల పోస్టులు సిగలింగ్‌, ట్రాక్‌ల నిర్వహణ వంటి భద్రతకు సంబంధించినవే. రైల్వే భద్రతకు ఉద్దేశించిన నిధులను అనవసరమైన ఖర్చులకు మళ్లిస్తున్నారని కాగ్‌ తన 2022 నివేదికలో ఎత్తిచూపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img