నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది జరిగే 77వ గణతంత్ర వేడుకుల్లో ఈసారి తెలంగాణ బిడ్డలు ప్రత్యేకంగా నిలవబోతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇతర దేశాధిపతుల ముందు తెలంగాణకే సొంతమైన కళారూపాన్ని ప్రదర్శింనున్నారు. ఇప్పటి వరకు ఎన్నో కళారూపాలు రిపబ్లికే డేలో పాల్గొన్నా, తొలిసారి ఒగ్గుడోలు విన్యాసానికి చోటు దక్కింది. ఈ ప్రదర్శన కోసం సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నుంచి ప్రఖ్యాత ఒగ్గు డోలు కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి బృందానికి ఆహ్వానం అందింది. దీంతో ఒగ్గు రవి నేతృత్వంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది కళాకారులు ఈనెల 8నే ఢిల్లీకి చేరుకున్నారు. ఎముకలు కొరికే చలిలో దాదాపు 15 రోజులుగా కర్తవ్యపథ్ పై ప్రాక్టీస్ చేస్తున్నారు. సుమారు వంద మంది కళాకారులు దేశంలోని వివిధ కళారూపాలతో కలిపి, ఏక్ భారత్ అనే కాన్సెప్ట్ తో కళారూపాన్ని ప్రదర్శించనున్నారు.
తెలుగు రాష్ట్రాల ఎన్‌సిసి క్యాడెట్లు
త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీస్ కంటింజెట్లకు ఏమాత్రం తీసిపోకుండా, కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్‌సిసి విద్యార్థులు ఈసారి కవాతు చేయబోతున్నారు. ఎపి, తెలంగాణ నుంచి మొత్తం 133 మంది పాల్గొంటున్నారు. ఈ టీంను కవాడీ గూడకు చెందిన బీటెక్ మూడో ఏడాది విద్యార్థి భరత్ లీడ్ చేయబోతున్నాడు. డిసెంబర్ 27 న ఢిల్లీ వచ్చిన ఈ టీం దాదాపు నెల రోజులుగా కర్తవ్య పథ్ పై కవాతు చేస్తోంది.
తొలిసారిగా చలనచిత్ర శకటం
భారత గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారిగా భారతీయ సినిమా అపూర్వమైన రీతిలో జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు సంజరు లీలా భన్సాలీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కోసం సినీ శకటాన్ని రూపొందించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ ఉత్సవాల్లో ప్రముఖ సినీ దర్శకుడు ఈ ప్రత్యేక సినీ శకటానికి ప్రాతినిధ్యం వహించడం విశేషం. ‘భారత్ గాథ’ అనే భావనతో తీసుకువస్తున్న ఈ శకటానికి కొత్తగా స్వరపరిచిన, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట తోడవుతుంది. జీవన సాంస్కృతిక కథనంగా సినిమా పట్ల భన్సాలీ దార్శనికతకు ఇదొక తార్కాణంగా నిలుస్తుంది.



