Thursday, May 8, 2025
Homeఎడిట్ పేజిఫాసిజం మీద కమ్యూనిజం గెలుపునకు 80 వసంతాలు

ఫాసిజం మీద కమ్యూనిజం గెలుపునకు 80 వసంతాలు

- Advertisement -

ఫాసిజం మీద విజయం సాధించిన 80వ వార్షికోత్సవాన్ని యావత్‌ ప్రపంచం మే 9న జరుపుకోనున్నది.ఫాసిస్ట్‌ మూకను సమూలంగా ఓడించి, 1945లో ఇదే రోజున సోవియట్‌ యూనియన్‌ ఎర్రసైన్యం బెర్లిన్‌ పార్లమెంట్‌ భవనం మీద ఎర్రజెండా ఎగరవేసింది. ఓటమి అనివార్యం అని గ్రహించిన హిట్లర్‌ ఏప్రిల్‌ 30న ఆత్మహత్య చేసుకున్నాడు. ఫాసిజం మీద సాధించిన ఈ విజయం ఈనాటి జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా ఎంతో ప్రాముఖ్యత కలిగి వుంది.1920ల నాటి మహామాంద్యాన్ని ఆధిగమించి, రాజ్యాధికారంపై తమ అధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి పాలక వర్గాలు ఫాసిజాన్ని ఎంచుకున్నాయి. ఆ దశాబ్దాల కాలంలో చాలా దేశాల్లో విస్తారంగా కార్మికవర్గ పోరాటాలు జరుగుతున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం ప్రబలంగా ఉంది. 1917లో మహత్తర అక్టోబర్‌ సోషలిస్ట్‌ విప్లవం విజయం సాధించటం, అన్నిరకాల దోపిడీ రూపాలను అంతమొందించటానికి అది చేస్తున్న బృహత్తర కృషి యావత్‌ ప్రపంచంలోని ప్రజలకు ఉత్తేజాన్ని ఇచ్చింది. అప్పుడే ఆవిర్భవించిన సోవియట్‌ రాజ్యం, తనను మట్టుబెట్టాలని చుట్టుముట్టిన సామ్రాజ్యవాదాన్ని ఓడించటం, మాజీ రష్యన్‌ పాలకులు దేశంలో అంతర్‌ యుద్ధాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకోవడం ప్రపంచ ప్రజానీకం ప్రత్యక్షంగా చూసింది.ఈ పరిణామాలతో ఉత్తేజితులైన కార్మిక వర్గం జర్మనీ, హంగేరీ వంటి దేశాల్లో పాలకవర్గాలను అధికారం నుంచి కూలదోయాలని ప్రయత్నించింది. అనేక కారణాలతో ఈ ప్రయత్నాలు విఫలమైనాయి. కానీ ఈ ప్రయత్నాలు పాలక బూర్జువాలకు హెచ్చరికలుగా పనిచేశాయి.
ఆర్థిక సంక్షోభ కాలంలో కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోని కార్మిక వర్గం రాజ్య అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేసే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికై పాలకవర్గాలు వివిధ రూపాల్లో ఫాసిస్ట్‌ శక్తులను – ఇటలీలో ముసోలిని, జర్మనీలో హిట్లర్‌, జపాన్‌లో హీరో హీటో – ప్రోత్సహించాయి. ఇది కేవలం దేశీయ బూర్జువాల మద్దతుతో పెరిగిన ఫాసిజం కాదు. ఆనాడు దాదాపు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి అన్ని ప్రధాన పెట్టుబడిదారి దేశాలు, ఫాసిజాన్ని పెంచి పోషించడంలో తమ వంతు పాత్ర నిర్వహించాయి. ఫోర్డ్‌, రాక్‌ ఫెల్లర్‌, కోకాకోలా లాంటి బడా పారిశ్రామిక సంస్థలు ఫాసిజం అభివృద్ధికి బహిరంగంగా సహాయపడ్డాయి. ఇటువంటి సందర్భంలోనే కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ నాయకుడు, ఫాసిస్టు వ్యతిరేక పోరాటయోధుల్లో ఒకడైన జార్జ్‌ డిమిట్రోవ్‌ ఫాసిజాన్ని ఈ విధంగా నిర్వచించారు-” కార్మిక వర్గాన్ని భయపెట్టే విత్త పెట్టుబడి బహిరంగ భయోత్పాత నిరంకుశత్వమే ఫాసిజం.”ఈ దేశాల పాలకవర్గాలు హిట్లర్‌ తిరిగి జర్మనీకి ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో ఉన్న ప్రమాదాన్ని పట్టించుకోలేదు. హిట్లర్‌ చేసే ప్రకటనలను, భూగోళం నుంచి కమ్యూనిజాన్ని తుడిచిపెట్టాలనే హిట్లర్‌ సంకల్పాన్ని వీరు నమ్మారు. ముఖ్యంగా విన్‌స్టన్‌ చర్చిల్‌ కమ్యూనిజం పట్ల తనకున్న విపరీత ద్వేషాన్ని ఎప్పుడూ దాచిపెట్టుకోలేదు. సోవియట్‌ యూనియన్‌ ని హిట్లర్‌ ఓడిస్తాడని వీరంతా ఆశపడ్డారు. కమ్యూనిజం పట్ల ఉన్న గుడ్డిద్వేషంతో హిట్లర్‌ యూరప్‌ మీద దండయాత్రను అడ్డుకోవటానికి నిరాకరించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా జట్టు కట్టటానికి స్టాలిన్‌ ఇచ్చిన పిలుపును బ్రిటన్‌, ఫ్రాన్స్‌, అమెరికాలు నిష్కర్షగా వ్యతిరేకించాయి.
హిట్లర్‌ సాయుధ దాడిని ప్రారంభించి, ఫ్రాన్స్‌ను ఓడించి, బ్రిటన్‌ ముంగిట ప్రమాదం ప్రత్యక్షంగా పొంచి ఉన్నప్పుడు మాత్రమే తమ దేశాలకు ప్రమాదం ఏర్పడిందని ఈ దేశాలు గ్రహించడం మొదలుపెట్టాయి. అప్పటికి కూడా , కలిసి పోరాడదాం అని సోవియట్‌ యూనియన్‌ పదేపదే చేసిన విజ్ఞప్తులను మీరు లక్ష్యపెట్టలేదు. సోవియట్‌ యూనియన్‌ని ఓడించే మొనగాడని హిట్లర్‌ మీద, హిట్లర్‌ సామర్థ్యం మీద ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. ఫాసిజానికి వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు రెండో యుద్ధ రంగాన్ని తెరవడంలో జరిగిన ఆలస్యానికి కారణం ముఖ్యంగా ఇదే. ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ, సోవియట్‌ యూనియన్‌ ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అగ్రభాగాన ఉండి, దాన్ని ఓడించడంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ యుద్ధంలో రెండుకోట్ల మంది సోవియట్‌ పౌరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీరిలో దాదాపు 30లక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులే. సోవియట్‌ దేశం అంతులేని సంపదను నష్టపోయింది. దాని పరిశ్రమలు, వ్యవసాయం ధ్వంసమయ్యాయి. ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు లాంటి కీలక పౌర సదుపాయాలు శిథిలమయ్యాయి. సోవియట్‌ యూనియన్‌ భూభాగాలైన స్టాలిన్‌ గ్రాడ్‌, లెనిన్‌ గ్రాడ్‌, కుర్క్స్‌లలో జరిగిన యుద్ధాలు ప్రతిఘటనకు, దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచాయి. మాతృభూమిలోనే ప్రతి అంగుళాన్ని కాపాడుకోవటానికి సోవియట్‌ సైన్యం భీకరమైన పోరాటం చేసింది. అంతిమంగా ఈ రంగాల్లో ఎర్రసైన్యం సాధించిన విజయాలే హిట్లర్‌ ఓటమికి కారణంగా ప్రపంచం గుర్తించక తప్పలేదు. సోవియట్‌ సైన్యం నిర్ణయాత్మకంగా ఫాసిస్టు శక్తులను సోవియట్‌ భూభాగం నుంచి పారద్రోలటం ప్రారంభంకాగానే, మిత్రపక్షాలు హడావుడిగా రెండవ యుద్ధ రంగాన్ని తెరిచాయి.
కమ్యూనిస్టు అంతర్జాతీయతకు కట్టుబడిన స్ఫూర్తికలిగిన ఎర్రసైన్యం తమ దేశాన్ని విముక్తి చేయటంతో ఆగలేదు. జైత్రయాత్రను బెర్లిన్‌ వైపునకు సాగించారు. మార్గమధ్యంలో నాజీలు ఆక్రమించిన అనేక దేశాలను విముక్తి చేశారు.రెడ్‌ ఆర్మీకి మద్దతుగా ఫాసిస్ట్‌ ఆక్రమిత దేశాలలోని కమ్యూనిస్టు పార్టీలు నిర్వహించిన పాత్ర కూడా అంతే వీరోచితమైనది. శత్రుశ్రేణుల వెనక గెరిల్లా ఎత్తుగడలను ఉపయోగించి ప్రతిఘటనా పోరాటాన్ని నిర్వహించడంలో అనేకమంది తమ జీవితాలను అంకితం చేశారు. వారి ధీరోదాత్త ప్రయత్నాలు విస్తృతంగా కొనియాడ బడ్డాయి. హిట్లర్‌ ఓటమి తర్వాత ఈ దేశాల్లోని ప్రజలు అనేకమంది తమ దేశాన్ని నడిపే నాయకత్వాన్ని కమ్యూనిస్టు పార్టీల చేతుల్లో పెట్టారు. ఈ విధంగా అనేక తూర్పు యూరోప్‌ దేశాలు సోషలిజం వైపు మళ్లాయి. ఫ్రాన్స్‌, స్పెయిన్‌ లాంటి పశ్చిమ యూరప్‌ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించాయి. కమ్యూనిజం పెరిగి, సోషలిజం విస్తరిస్తుండటంతో, బూర్జువా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికై యూరప్‌ దేశాల పునర్నిర్మాణమంటూ అమెరికా మార్షల్‌ ప్లాన్‌ ప్రవేశపెట్టింది. సామాజిక సంక్షేమ విధానాల ఆవిర్భావాన్ని, సంక్షేమ రాజ్యాల ఏర్పాటును ఈ కాలం చూసింది. ఫాసిజాన్ని ఓడించటంలో సోవియట్‌ యూనియన్‌, ఎర్రసైన్యం పాత్రను తుడిచి పెట్టాలని పెట్టుబడిదారీ వర్గం ఎంత గట్టిగా ప్రయత్నించినా, ఆ విషయంలో విజయం సాధించలేకపోయింది. చరిత్రను వక్రీకరించడానికి సంస్కృతిని ఒక ప్రధాన ఆయుధంగా వారు ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధం మీద వందలకొద్దీ హాలీవుడ్‌ సినిమాలు నిర్మించారు. ఈ సినిమాల్లో ఎక్కువ భాగం, రెండవ ప్రపంచ యుద్ధంలో ఎర్రసైన్యం నిర్వహించిన నిర్ణయాత్మక పాత్రను బుద్ధిపూర్వకంగా ఉపేక్షించి, అమెరికా, బ్రిటన్‌ల పాత్రను అతిగా కీర్తించేవిగా ఉన్నాయి.
సోషలిజానికి ఎదురుదెబ్బ తగిలి, సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తర్వాత, చరిత్రను తిరిగి రాసే ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.అనేక తూర్పు యూరోపియన్‌ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీల చిహ్నాలైన – ఎర్ర జెండా, సుత్తి కొడవలివంటి గుర్తులతో పాటు కమ్యూనిస్టు పార్టీలను నిషేధించారు. ఒక పద్ధతి ప్రకారం పాఠ్య పుస్తకాలు తిరిగి రాయటం మొదలైంది. చరిత్రకు సంబంధించిన నవలలు అనే ముసుగు వేసుకుని, కమ్యూనిస్టు పార్టీలను, ఫాసిజాన్ని ఓడించిన దాని పాత్రను తూలనాడుతూ వందల పుస్తకాలు భారీ ఎత్తున ప్రచురిం చడం జరిగింది. కానీ వీరంతా ఒక విషయాన్ని మర్చిపోయారు- చరిత్ర ఒకసారి నిర్మితమైతే, దాన్ని తప్పించటం ఎవరి వల్లా కాదు. ఫాసిజం మీద విజయం సాధించిన 80వ వార్షికోత్సవాన్ని భారీ ఎత్తున జరపడానికి రష్యా ఇప్పుడు సన్నద్ధమవుతున్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కమ్యూనిస్టు కాదు. నిజానికి, కమ్యూనిజాన్ని, కమ్యూనిస్టు పార్టీని, మరీ ముఖ్యంగా మహత్తర అక్టోబర్‌ సోషలిస్టు విప్లవ నాయకుడు లెనిన్‌ని అనేకసార్లు దూషించాడు. అయినప్పటికీ, ఈ స్మారక మహోత్సవంలో రెడ్‌ఆర్మీ చిహ్నాలను, స్టాలిన్‌ని జ్ఞప్తి చేసుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఎర్రసైన్యం వీరోచిత పాత్రను తెలియజేస్తూ మాస్కోలోని దుకాణాలు ఎర్రజెండాలతో, చిత్రాలతో అలంకరించబడ్డాయి. బెర్లిన్‌ పార్లమెంట్‌ భవనం రిచిస్టాగ్‌ మీద రెడ్‌ ఆర్మీ సైనికుడు ఎర్ర జెండా ఎగరవేసే అద్భుత ఘట్టాన్ని చూపే బొమ్మలు చాలా దుకాణాల్లో పెట్టారు. యుద్ధంలో వివిధ ఘట్టాల్లో ఎర్రసైన్యం ధైర్య సాహసాలను, సోవియట్‌ ప్రజల త్యాగాలను మాస్కోలోని విక్టరీ మ్యూజియం ప్రదర్శనకి పెట్టింది. వీటిలో స్టాలిన్‌, సుత్తి కొడవలి ఉన్న ఎర్ర జెండాలతో కూడిన అనేక అనేక చిత్రాలు, వీడియోలు ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి,ఫాసిజాన్ని ఓడించటంలో సోవియట్‌ యూనియన్‌ ప్రజలు నిర్వహించిన వీరోచిత కథనాల గురించి తెలుసు కోవటానికి ప్రజలు బృందాలుగా మ్యూజియం కి వస్తున్నారు. అలా వచ్చేవారిలో యువత కూడా గణనీయంగా ఉంది. ఎర్రసైన్యం వీరోచిత పాత్రను చరిత్ర పుటల నుంచి తుడిచి పెట్టలేరని ఇవన్నీ నిరూపిస్తున్నాయి..
ఫాసిజంపై సాధించిన విజయాన్ని పురస్కరించుకుని రష్యా ఫెడరేషన్‌ కమ్యూనిస్టు పార్టీ(సిపిఆర్‌ఎఫ్‌) ఎనభయ్యవ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 21-25 దాకా ఫాసిస్ట్‌ వ్యతిరేక వేదికను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 91 దేశాల నుంచి పార్టీలు, సంస్థల నుంచి 164 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ రష్యా ఫెడరేషన్‌ చైర్‌ పర్సన్‌ గెన్నాడి జ్యుగనోవ్‌ వేదికను ప్రారంభించారు. ఎర్రసైన్యం నిర్వహించిన మహోన్నతమైన పాత్రను, సోవియట్‌ ప్రజలు చేసిన ఎనలేని త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. చైనా కమ్యూనిస్టు పార్టీ, క్యూబా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు కూడా ప్రారంభోత్సవ సమావేశంలో ప్రసంగించారు. ప్రారంభ సమావేశం తర్వాత, ఈనాడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఫాసిస్టు ప్రమాదాన్ని, దాని వివిధ రూపాల గురించి మూడు ప్లీనరీ సమావేశాల్లో చర్చించారు. దాదాపు 60 పార్టీలు పత్రాలను సమర్పించి, పెరుగుతున్న ఫాసిజం ప్రమాదం గురించి, సామ్రాజ్యవాదం దురాక్రమణ గురించి ఆలోచనలను పంచుకున్నారు. గాజా, పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ దురాక్రమణను, ఆయుధాలు అందించడంలో, అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచడంలో అమెరికా పాత్రను సమావేశంలో పాల్గ్గొన్న ప్రతినిధులందరు ఖండించారు. 1967కి పూర్వం ఉన్న సరిహద్దులతో, తూర్పు జెరూసలేం రాజధానిగా సార్వభౌమాధికార పాలస్తీనాను ఏర్పాటు చేయటంలో తమ నిబద్ధతను ఏకగ్రీవంగా పునరుద్ఘాటించారు. ప్రతినిధులందరూ క్యూబా పట్ల దృఢమైన సంఘీభావాన్ని ప్రకటించారు. ఆ దేశం పైన విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ముక్తకంఠంతో ఖండించారు.ఈ వేదిక నయా ఉదారవాద ప్రమాదాన్ని గురించి ప్రముఖంగా పేర్కొన్నది. ఆ విధానాల ఫలితమే ప్రపంచవ్యాప్తంగా ఫాసిస్టు శక్తులు ఎదిగే పరిస్థితులను సిద్ధం చేశాయని పేర్కొన్నది. ఈ వేదికకు హాజరైన కమ్యూనిస్టు పార్టీలు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, నయా ఉదారవాద దాడులకు వ్యతిరేకంగా, తమ దేశాల్లో పాలక వర్గాలు వ్యాప్తి చేస్తున్న విచ్ఛిన్నకర రాజకీయాలకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడుతామని పునరుద్ఘాటించాయి. ప్రజల ఐక్యతతోనే ఫాసిజాన్ని ఎదుర్కొనగలమని చరిత్ర చెబుతున్నది. ఫాసిస్టు దాడులను ఎదుర్కోవడంలో, అంతిమంగా దాన్ని ఓడించడంలో కార్మిక వర్గం, సమాజంలోని ఇతర శ్రామిక ప్రజల మధ్య ఐక్యత ప్రజల్లోని అనేక తరగతులను సమీకరించగల పునాదిని ఏర్పరుస్తుంది.
(పీపుల్స్‌ డెమోక్రసీ సౌజన్యంతో)
– అనువాదం: కర్లపాలెం
ఆర్‌.అరుణ్‌కుమార్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -