నవతెలంగాణ-హైదరాబాద్: భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారని అన్న మాటలకు తన భార్య కూడా బాధ పడిందని ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. ఇకపై ఆచితూచి మాట్లాడతానని వెల్లడించారు. ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ ఇటీవలే చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఎప్పుడూ ఇంట్లోనే ఉంటూ ఏం చేస్తారు..? ఎంతసేపని భార్య ముఖం తదేకంగా చూడగలరు? ’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, ఆ వ్యాఖ్యలపై సుబ్రహ్మణ్యన్ తాజాగా స్పందించారు.
కంపెనీకి సంబంధించిన సమస్యల గురించి ఆందోళనలో ఉన్న సమయంలో అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. ‘కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల్లో జాప్యంపై కొంతమంది ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి కాల్స్, ఈమెయిల్స్ ద్వారా నాకు వ్యక్తిగతంగా ఫిర్యాదులు వచ్చాయి. ప్రాజెక్టుల్లో పురోగతి గురించి వారు ఆందోళన వ్యక్తం చేశారు. పని జరగాల్సిన విధంగా జరగకపోవడంతో ఆందోళన చెందాను. ఆ సమయంలో అలా మాట్లాడాను. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. వేరే పరిస్థితుల్లో అయితే మరోలా మాట్లాడేవాడిని. నా మాటలు రికార్డ్ చేస్తున్నట్లు కూడా నాకు తెలియదు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు అంటూ నేను అన్న మాటలకు నా భార్య కూడా బాధపడింది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది జనవరిలో తన ఉద్యోగులతో ఇంటరాక్షన్ సందర్భంగా సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని (90-hour work week) సూచించారు. అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోవాలన్నారు. ఎంతసేపు అలా భార్యను చూస్తూ ఉండిపోతారు..? అంటూ ప్రశ్నించారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కవ సమయం ఉంటామని భార్యలతో చెప్పాలని ఉద్యోగులతో అన్నారు. ‘ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు బాధపడుతున్నా. మీతో ఆదివారాలూ పనిచేయించగలిగితే నేను మరింత సంతోషంగా ఉంటాను. ఎందుకంటే నేను ఆదివారాలు కూడా పనిచేస్తున్నాను’ అని ఉద్యోగులతో అన్నారు.