నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ అంశంగా మోడీ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడి మధ్యవర్తిత్వంపై ప్రభుత్వం తన వైఖరి తెలపాలన్నారు. దేశంలోని తాజా పరిస్థితులపై ప్రధాని నేతృత్వంలో అఖిలపక్ష సమావేశంతో పాటు, తక్షణమే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో సచిన్ పైలట్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్య భారత్ – పాక్ దేశాల మధ్య అని చెప్పే బీజేపీ ప్రభుత్వం, మూడో దేశమైన అమెరికా మధ్య వర్తిత్వాన్ని ఎలా అంగీకరించిందని ప్రశ్నించారు. భారత్-పాక్‌లు ఒక తటస్థ వేదికపై సమావేశం అవుతాయని అమెరికా అధికారుల ప్రకటనను తప్పుబట్టారు. ఇది కాశ్మీర్ సమస్యను అంతర్జాతీకరించే ప్రయత్నమన్నారు. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ షరతులు ఏంటో దేశ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని 1994లో పార్లమెంట్‌లో ఏకగ్రీవ తీర్మానం జరిగిందని గుర్తు చేశారు. ఈ తీర్మానానికి ప్రస్తుత పార్లమెంట్‌లోని ప్రతి సభ్యుడు ఏకగ్రీవంగా మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కాల్పుల విరమణకు ఒక రోజు ముందు పాకిస్తాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) బిలియన్ డాలర్లకుపైగా అప్పు ఇవ్వడాన్ని ఆయన ప్రస్తావించారు. దేశ ప్రజల మనసులో ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అందువల్ల తక్షణమే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి సందేహాలను తీర్చాలని డిమాండ్ చేశారు. అలాగే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి భద్రతాపరమైన అంశాలను తెలపాలన్నారు.
కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం : సచిన్ పైలట్
- Advertisement -
- Advertisement -