సమ్మెను ఉధృతం చేస్తాం అసంతృప్తికరంగా మంత్రి హామీలు

– పోరాడే సంఘాలను పిలవకపోవడం అప్రజాస్వామికం:
– తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మళ్లీ పాత పద్ధతిలోనే అంగన్వాడీ ఉద్యోగులను మోసం చేసేలా మంత్రి హామీలున్నాయనీ, అంగన్వాడీల కీలక సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో సమ్మెను ఉధృతం చేస్తామని తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ నేతలు పి.జయలక్ష్మి(సీఐటీయూ), ఎన్‌.కరుణకుమారి(ఏఐటీయూసీ) ప్రకటించారు. సెప్టెంబర్‌ 11 నుంచి సమ్మె చేస్తున్న, సమస్యలపై పోరాడుతున్న సంఘాలను మంత్రి చర్చలకు పిలవకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. అసలు పోరాటంలోనే లేని సంఘాలతో చర్చలు జరపడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. అతి ముఖ్యమైన డిమాండ్లు అయిన పర్మినెంట్‌, కనీస వేతనం, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ పెంపు అంశాలను కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని పేర్కొన్నారు. బతికున్నప్పుడు సౌకర్యాలు కల్పించాలనే డిమాండ్లను పక్కనపెట్టి కేవలం చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు నిర్వహించడానికి టీచర్లకు రూ.20 వేలు, ఆయాలకూ రూ.10 వేలు ప్రభుత్వం నిర్ణయం చేయడం దుర్మార్గమని తెలిపారు. చావులోనూ టీచర్లకు, ఆయాలకు అమౌంట్‌లో వ్యత్యాసం చూపించటం సరైంది కాదని పేర్కొన్నారు. రూ.2 లక్షల ఇన్సూరెన్స్‌ అని చెప్పారుగానీ జీవో మాత్రం రాలేదని తెలిపారు. మినీ వర్కర్ల సర్కులర్‌లో మినీలను మెయిన్‌ టీచర్స్‌గా నియామకం, హెల్పర్ల నియామకంపైన స్పష్టత లేదని పేర్కొన్నారు. షరతులు అనే అంశం మినీ టీచర్లకు ప్రమాదకరంగా మారబోతుందని తెలిపారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ విషయంలో కొత్తగా చెప్పిందేమీ లేదని పేర్కొన్నారు.

Spread the love