నవతెలంగాణ – హైదరాబాద్: రాజస్థాన్‌లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో కారును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వారు కారులోనే సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన బార్మర్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం, గూడమలానీ తహసీల్‌లోని డాబర్ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు పని నిమిత్తం సింధారీకి వెళ్లారు. పని ముగించుకుని అర్ధరాత్రి దాటాక తమ స్కార్పియో వాహనంలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వారి గమ్యస్థానానికి ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా, సింధారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సదా గ్రామ సమీపంలో మెగా హైవేపై ఎదురుగా వస్తున్న ఓ ట్రైలర్‌ను వారి కారు బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన తీరు ఎంత తీవ్రంగా ఉందంటే, ఢీకొన్న వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో మోహన్ సింగ్ (35), శంభు సింగ్ (20), పంచారామ్ (22), ప్రకాశ్ (28) అనే నలుగురు యువకులు తీవ్రమైన గాయాలతో అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి మరణించారు. కారు నడుపుతున్న దిలీప్ సింగ్ మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.