నవతెలంగాణ-హైదరాబాద్: విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు దీపావళి పండుగకు స్వదేశానికి వస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొందామనే సంతోషంలో ఉన్న ప్రవాస భారతీయుల ఆశలపై ఎయిర్ ఇండియా నీళ్లు చల్లింది. దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ నుండి భారతదేశానికి బయలుదేరిన వందలాది మంది ప్రయాణికులు తాము శుక్రవారం ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయ్యిందని తెలియడంతో షాక్‌నకు గురయ్యారు. తదుపరి విమానం సోమవారం (దీపావళి) లేదా ఆ మర్నాడు (మంగళవారం) బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
ఏఐ 138 విమానం రద్దు : ఎయిర్ ఇండియా
సాంకేతిక సమస్య కారణంగా మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా … 2025, అక్టోబర్ 17న మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఈ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.
చిక్కుకుపోయిన ప్రయాణీకులకు అన్ని సహాయాలు అందిస్తున్నాం : ఎయిర్ ఇండియా ప్రతినిధి
‘ఎయిర్ ఇండియాతోపాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ప్రతినిధి పేర్కొన్నారు.