- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
నవతెలంగాణ-కామారెడ్డి: అమరవీరుల త్యాగనిరతి ఫలితమే నేడు కనిపిస్తున్న శాంతి, సౌభ్రాతృత్వం, పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. పోలీస్ అమరవీరుల దినోత్సవన్నీ పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అమరవీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో కలసి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. కామారెడ్డి జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో ఏడుగురు పోలీసులు అసువులు బాసారని,పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగం భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రజల రక్షణ, భద్రత, శాంతి స్థాపన కోసం అంకితభావంతో సేవలందించే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మన జిల్లాలో ఏడుగురు పోలీసు సిబ్బంది అమరులయ్యారని వారికి గౌరవప్రదంగా నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.
అమరవీరుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి సంక్షేమానికి అన్ని విధాల సహాయం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి భద్రతల స్థాపన కోసం అసాంఘిక శక్తులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవి. వారు చూపిన స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ కర్తవ్యనిష్ఠతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఆర్మీ జవానులు, పోలీసులు విధి నిర్వాహణలో ఎల్లప్పుడూ దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 1959 అక్టోబర్ 21న లడక్‌లోని అక్సాయ్ చిన్ వద్ద చైనా దళాల దాడిలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సందర్భాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది అని చెప్పారు.

ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అసాంఘిక శక్తులతో పోరాటంలో 191 మంది పోలీసు సిబ్బంది వీరమరణం పొందగా, తెలంగాణ రాష్ట్రం నుండి 5 మంది – అసిస్టెంట్ కమాండెంట్ బానోత్ జవహర్‌లాల్, కానిస్టేబుళ్లు టి. సందీప్, వడ్ల. శ్రీధర్, యం. పవన్ కళ్యాణ్, బి. సైదులు అమరులయ్యారని ఎస్పీ తెలిపారు. విధి నిర్వాహణలో ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను నెరవేర్చడం, వారి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేయడం, ఆర్థిక పరమైన ప్రయోజనాలు సమయానికి అందేలా చూడడం, మానసిక బలాన్ని అందించడం ఇవే పోలీస్ అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
పోలీస్ అమరవీరుల స్మరణార్థం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి అక్టోబర్ 31 వరకు రక్తదాన శిబిరాలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, వ్యాసరచన, ఫోటో, వీడియో పోటీలు నిర్వహించబడతాయని, అలాగే అమరవీరుల కుటుంబాలను స్వయంగా సందర్శించి వారికి గౌరవప్రదంగా నివాళులు అర్పిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపి్‌ఎస్ , సిఐలు కామారెడ్డి నరహరి, కామారెడ్డి రూరల్ రామన్, బిక్నూర్ సంతోష్ కుమార్, ఆర్ఐ, నవీన్ కుమార్, సంతోష్ కుమార్, కృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
