నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్, ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు అత్యంత వివాదాస్పద రీతిలో సమాధానమిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరగబోయే భేటీ వేదిక గురించి ప్రశ్నించగా, “మీ అమ్మే నిర్ణయించారు” అంటూ ఆమె బదులివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో త్వరలో సమావేశం కానున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ భేటీకి వేదికను ఎవరు ఎంపిక చేశారని హఫింగ్‌టన్ పోస్ట్ రిపోర్టర్ ఎస్‌వీ డేట్ టెక్స్ట్ మెసేజ్‌లో ప్రశ్నించగా, లెవిట్ పైవిధంగా స్పందించారు.
కాగా, ట్రంప్-పుతిన్ కీలక సమావేశం రాబోయే వారాల్లో హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా తేదీ ఖరారు కాలేదు.