– ఒకరు స్క్రిఫ్ట్ రాస్తే ఇంకొకరు డెలివరీ
– రాష్ట్ర ఆర్థిక స్థితి చెబితే ఇరుపార్టీల వక్రభాష్యాలు
– మున్నేరు నిర్వాసిత కాలనీకి భూములివ్వకుండా అడ్డుకునే యత్నాలు
– రివర్‌ఫ్రంట్‌లో నిర్వాసితుల కోసం అద్భుతమైన కాలనీ : రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
– ఖమ్మం మున్నేరుపై నిర్మిస్తున్న గోడ నిర్మాణ పనుల పరిశీలన
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరంతో పాటు రూరల్ మండలంలోని అనేక ప్రాంతాలను మున్నేరు ముంపు నుంచి రక్షించేందుకు చేపట్టిన రిటైనింగ్ వాల్‌పై కొందరు కుట్రలు చేస్తున్నారని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 2026 వరకు వాల్ నిర్మాణానికి గడువు పెట్టామనీ, దానికనుగుణంగా చిత్తశుద్ధితో పనులు చేస్తున్నామని అన్నారు. పేదలను రక్షించే క్రెడిట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతే తమ ఉనికికి ప్రమాదమని భావించి కొందరు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. రైతులను రెచ్చగొట్టటం, కుట్రపూరితమైన పనులకు పూనుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి సోమవారం ఆర్‌సీసీ వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న అవరోధాలను అధిగమించి మిగిలిన పనులను కూడా పూర్తి చేసేందుకు కలెక్టర్, అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకటి, రెండు నెలల్లోనే రూ.680 కోట్లతో రిటైనింగ్ వాల్‌కు టెండర్లు పిలిచిందని తెలిపారు. నిర్వాసితులకు సైతం ఈ రివర్‌ఫ్రంట్‌లోనే పోలేపల్లిలో ఓ అద్భుతమైన కాలనీని నిర్మించాలని నిర్ణయించిందని అన్నారు. ఈ ప్రాంతంలో భూములున్న ఆసాములు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు. రిటైనింగ్ వాల్‌కు ఆనుకొని ఉన్న ఇంటికి కూడా వరద ముంపు లేకుండా గోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఎర్త్‌బండ్ వేస్తే ఎక్కువ స్థలం అవసరమవుతుందని, సామాన్య ప్రజల ఇండ్లు పోతాయనే ప్రభుత్వానికి ఆర్థిక భారమైనా ఆర్‌సీసీ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. మున్నేరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ వరద విపత్తులు సంభవించినా ఎదుర్కొనేలా ఇప్పటికే ప్రణాళిక రూపకల్పన చేశామన్నారు.
వాల్‌కు సమాంతరంగా బీటీ రోడ్, డ్రెయినేజీ
గోడ నిర్మాణంతో స్థానికంగా డ్రెయినేజీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్ రూపొందించామని మంత్రి చెప్పారు. దాని పక్కనే బీటీ రోడ్డు కూడా నిర్మిస్తామన్నారు. మున్నేరుకు ఇరువైపులా 17 కి.మీ మేర నిర్మించే ఈ వాల్ 8 కి.మీ మేర పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు.
20 రోజుల్లో వీటిని ఓ ఆకృతికి పట్టుకొస్తామని తెలిపారు. భూ నిర్వాసితులకు పరిహారంగా ఓ అద్భుతమైన నగరాన్ని రివర్‌ఫ్రంట్‌లో కట్టబోతున్నామన్నారు. సుమారు 450-500 ఎకరాల ప్రభుత్వ భూమి ఇక్కడ ఉందన్నారు. లోకల్‌గా వచ్చే వరదనీటిని డ్రెయిన్‌తో అనుసంధానించేందుకు కావాల్సిన ప్లానింగ్ కూడా ఒకటి, రెండు రోజుల్లో అందుబాటులోకి రాబోతుందన్నారు. నిర్మాణ పనుల తీరు, నాణ్యతను పరిశీలించేందుకు కలెక్టర్‌తో పాటు వచ్చామన్నారు. రాజీవ్ స్వగృహ టెండర్లపై కలెక్టర్ నేతృత్వంలో ఓ కమిటీ వేశామని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘సీతారామ’పై
బీఆర్‌ఎస్ విమర్శలు..
సీతారామ ప్రాజెక్టు విషయంలో ప్రధాన ప్రతిపక్షం అర్థరహితమైన విమర్శలు చేస్తోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. 90శాతం పూర్తయిన ప్రాజెక్టుకు మోటార్లు బిగించి డ్రైరన్ కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో నాటి ప్రభుత్వం ఉందన్నారు. 90శాతం పనులు పూర్తయితే ఇప్పటికీ ఇంకా 40శాతం పనులు ఎలా మిగిలి ఉంటాయని ప్రశ్నించారు. గాలి, నీరు, ఆహారం తామే కనుగొన్నామనే తీరుగా బీఆర్‌ఎస్ నేతల విమర్శలున్నాయన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలని.. ఒకరు స్క్రిప్ట్ రాస్తే.. ఇంకొకరు డెలివరీ చేస్తారని తెలిపారు.
ఢిల్లీ లెవల్లోనే ఇరుపార్టీలు ఓ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు. ఆనాటి ప్రభుత్వం ధనిక రాష్ట్రమని షో చేసి ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.8.19 లక్షల కోట్లు అప్పుందనే విషయం తేటతెల్లమైందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం ప్రకారం ఎక్కడెంత అప్పు తీసుకొచ్చారో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారన్నారు. ఉద్యోగస్తులు తమ కుటుంబ సభ్యులేనని తెలిపారు. రాష్ట్ర ఆర్థికస్థితిని ఉన్నది ఉన్నట్టుగా చెబితే బీఆర్‌ఎస్, బీజేపీ దానికి వక్రభాష్యాలు చెబుతున్నాయన్నారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఎం. వెంకటేశ్వర్లు, డీఈ బాణాల రమేశ్‌రెడ్డి, ఆర్ అండ్‌బీ ఎస్‌ఈ యాకూబ్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ వాణిశ్రీ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్‌కుమార్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.