Tuesday, May 13, 2025
Homeజాతీయం10 భారతీయ ఉపగ్రహాలు24 గంటలు పహారా

10 భారతీయ ఉపగ్రహాలు24 గంటలు పహారా

- Advertisement -

– ఇస్రో చైర్మ్మెన్‌ వి.నారాయణన్‌
ఇస్రో : పాకిస్థాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సరిహద్దుల తీరప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, రక్షించడానికి 10 భారతీయ ఉపగ్రహాలు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మెన్‌ వి.నారాయణన్‌ తెలిపారు. కీలకమైన నిఘా డేటాను అందించడం ద్వారా పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తాయని అన్నారు. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మెన్‌ ప్రసంగిస్తూ … భారతదేశపు 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం గురించి వివరించారు. మన దేశ భద్రతను నిర్ధారించుకోవాలంటే, మన ఉపగ్రహాల ద్వారా సేవలందించాలన్నారు. మన సముద్ర తీర ప్రాంతాలను మనం పర్యవేక్షించాలన్నారు. మనం మొత్తం ఉత్తర భాగాన్ని నిరంతరం పర్యవేక్షించాలని నారాయణన్‌ అన్నారు. శాటిలైట్లు, డ్రోన్‌ టెక్నాలజీ లేకుండా భారతదేశం పూర్తి భద్రతా కవరేజీని సాధించలేమని నారాయణన్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని దష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా ”పొరుగువారు” ముప్పును కలిగిస్తున్నందున, రక్షణ సంసిద్ధతకు అంతరిక్ష ఆధారిత నిఘా చాలా కీలకంగా మారింది. జాతీయ భద్రతపై ఇస్రో తీసుకుంటున్న చర్యలను, పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు. భద్రతాపరమైన అంశాలతో పాటు ఇస్రో ఉపగ్రహాలు వ్యవసాయం, టెలీ-ఎడ్యుకేషన్‌, టెలీ-మెడిసిన్‌, వాతావరణ అంచనాలు, పర్యావరణ పర్యవేక్షణ, ఆహార భద్రత వంటి అనేక పౌర సేవల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా విపత్తుల సమయంలో నష్టాన్ని గణనీయంగా తగ్గించడంలో ఉపగ్రహాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. గతంలో విపత్తుల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతే నేడు ఆ పరిస్థితి లేదని గుర్తుచేశారు. అంతరిక్ష రంగంలో భారత్‌ సాధించిన ఘన విజయాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రయాన్‌-1 ద్వారా చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్న తొలి దేశంగా భారత్‌ నిలిచిందని నారాయణన్‌ గర్వంగా ప్రకటించారు. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను భారత్‌ విజయవంతంగా ప్రయోగించిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -