నవతెలంగాణ-హైదరాబాద్: నైరుతి రుతుపవనాలతో భారత్‌లో భారీ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. హిమచల్ ప్రదేశ్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్నాటక, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పెద్ద మొత్తంలో వరదలు సంభవించి రోడ్లు, అనేక పంటలు వరదల ధాటికి ధ్వంసమైయ్యాయి. తాజాగా ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో తమిళనాడులో పలు రోజులుగా భారీ నుంచి అతి భారీ వానాలు కురుస్తున్నాయి. చెన్నై (Chenai) సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, వీధులు నదులను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింద.
అయితే, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు చెన్నై సహా ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చంగల్పట్టు, రాణీపేట్.. ఈ ఐదు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు తమిళనాడులోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవా, అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ అంతటా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది.