ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ వెల్లడి
నగరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే, కలెక్టర్
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఆర్ధిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం వాటిని అధిగమిస్తూ ప్రజల సౌకర్యార్ధం అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని వివిధ డివిజన్లలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు చేశారు. గౌతమ్ నగర్ లో రూ. 3.46 కోట్ల వ్యయంతో చేపట్టనున్న స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్, సీసీ డ్రైన్స్, ఆర్.సీ.సీ స్లాబ్ కల్వర్ట్ ల నిర్మాణాలకు, ఎల్లమ్మగుట్ట అమ్మ వెంచర్ లో రూ. కోటి 19 లక్షల చేపట్టనున్న సీసీ రోడ్లు, బిటీ రోడ్ల నిర్మాణ పనులకు, న్యాల్ కల్ రోడ్డులో రూ. 3.43 కోట్ల రూపాయలతో వరద నీటి కాలువలు, బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, మాలపల్లిలో రూ. 37 లక్షలతో ఉర్దూ మీడియం కళాశాల మరమ్మతు పనులకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తూ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా విస్తరణ వంటి అభివృద్ధి పనులను చేయిస్తున్నామని అన్నారు. జిల్లాను పారిశ్రామికంగా, వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కలిసికట్టుగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా, ప్రజల అవసరాలను గుర్తిస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. నిజామాబాద్ నగరంలో మంజూరైన పనులే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమాలలో నుడా చైర్మన్ కేశవేణు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్ధిక ఇబ్బందులను అధిగమిస్తూ నిరంతర అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES