నవతెలంగాణ సూర్యపేట: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ ఇన్‌స్పెక్టర్ వీర రాఘవులు సోమవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కారు. అనిశా డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలో రెండు ప్రయివేటు వైద్యశాలలు, ఒక స్కానింగ్ సెంటర్ నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కొనసాగుతున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సభ్యులు గత నెల 29న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట పట్టణ రెండో పోలీస్ స్టేపణ్ లో ముగ్గురు నకిలీ వైద్యులపై అదే రోజు కేసు నమోదైంది. రిమాండ్‌కు తరలించకుండా ఉండాలంటే డీఎస్పీ పార్థసారథితో మాట్లాడుకోవాలని నిందితుల్లో ఒకరికి సూర్యాపేట ఇన్‌స్పెక్టర్ వీర రాఘవులు సలహా ఇచ్చారు.
ఇందుకు రూ.25 లక్షలు ఇవ్వాలని ఆ నకిలీ వైద్యుడిని డీఎస్పీ డిమాండ్ చేశారు. చివరికి రూ.16 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. డబ్బులు త్వరగా ఇవ్వాలని పోలీసులు ఒత్తిడి పెంచడంతో నల్గొండలోని అనిశా అధికారులను ఆ నకిలీ వైద్యుడు ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అదనపు ఎస్పీ కమలాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధారణ కావడంతో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. వారి కార్యాలయాలతోపాటు ఇళ్లల్లో సోదాలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను హైదరాబాద్‌లోని నాంపల్లి అనిశా కోర్టులో మంగళవారం హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు.