నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. కర్నూల్ జిల్లా కల్లెడ మండలం చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో నేషనల్ హైవే 44పై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనమైనట్లు సమాచారం. ఇప్పటి వరకూ 11 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ జితేందర్ లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాలని గద్వాల్ కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఏపీ అధికారులతో మాట్లాడి మృతుల వివరాలు, ప్రమాదం జరిగిన తీరును తెలుసుకోవాలని, తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.



