నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ త్రివిద దళాల అధిపతులతో ఢిల్లీలో ఉన్నతా స్థాయి సమావేశం నిర్వహించారు. పహల్గాం దాడితో ఆగ్రహించిన భారత్.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై ఎటాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాటకీయ పరిణామాలతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీంతో భారత్ -పాక్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. నిన్న ఆపరేషన్ సిందూర్ పై త్రివిద దళాల అధిపతులు మీడియా సమావేశంలో సవివరంగా పేర్కొన్నారు. పాక్ ఉగ్రచర్యలకు మద్దతుగా నిలుస్తోందని, అందుకే ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసిందని తెలిపారు. అత్యంత శక్తిసామర్థ్యాలతో కూడిన భారత్ గగన తలాన్ని ఛేదించడం పాక్ తరం కాలేదని, ఆ దేశ డ్రోన్లను సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. అయితే తాజాగా భారత్ సరిహద్దు వెంట పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడి అవకాశాలు మెండుగా ఉన్నాయని భదత్రా బలగాలు భావిస్తున్నాయి. ఈక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ త్రివిద దళాల అధిపతులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి వారితో పాటు డిఫెన్స్ సెక్రటరీ, సీడీఎస్ అనిల్ చౌహన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు.