నవతెలంగాణ-హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టీస్ సంజీవ్ ఖన్నా మంగళవారం పదవీ విరమణ చేశారు. తదుపరి సిజెఐ జస్టిస్ బి.ఆర్.గవాయికి బాధ్యతలు అప్పగించారు. జస్టిస్ బి.ఆర్.గవాయి బుధవారం భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టులో మంగళవారం ఉదయం జరిగిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. ప్రజల విశ్వాసాన్ని ఆదేశించలేమని, దానిని సంపాదించుకోవాలని, సుప్రీంకోర్టు ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు. ” నాకు మాటలు రావడం లేదు. చాలా జ్ఞాపకాలను నాతో పాటు తీసుకువెళ్తున్నాను. మీరు ఒకసారి న్యాయవాది అయిన తర్వాత ఎప్పటికీ న్యాయవాదిగానే ఉంటారు. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ఆదేశించలేము. సంపాదించుకోవాలి. న్యాయవ్యవస్థ అనేది ధర్మాసనం, బార్‌లను సూచించే సాధారణ పదం. బార్ అంటే న్యాయాన్ని కాపాడే వ్యక్తి ” అని అన్నారు. సుప్రీంకోర్టుకు జడ్జీలు విభిన్న ప్రాంతాలు, నేపథ్యాల నుండి వస్తారని, ఈ వైవిధ్యం న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని జస్టీస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. జస్టిస్ బి.ఆర్.గవాయి తనకు మద్దతునిచ్చారని అన్నారు. ఆయన గొప్ప సిజెఐగా నిలుస్తారని, ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను సంరక్షిస్తారని అన్నారు.
నేడు పదవీవిరమణతో జస్టిస్ సంజీవ్ ఖన్నా 20 ఏళ్ల జడ్జి ప్రస్థానానికి ముగింపుపలికారు. ఆయన మొదటిసారి 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. ఏడాది తర్వాత శాశ్వత జడ్జీ అయ్యారు. 2019లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన ఆయన జడ్జీగా కొనసాగారు. గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
గత ఆరేళ్లలో సుప్రీంకోర్టులో కీలకమైన ఆర్టికల్ 370, వ్యభిచారం నేరంకాదు, ఎన్నికల బాండ్ల పథకం, ఇవిఎం -వివిప్యాట్‌ల లెక్కింపు కేసు వంటి పలు చారిత్రాత్మక తీర్పులలో భాగంగా ఉన్నారు.